గట్టిగానే ఆర్భాటం చేసిన బబుల్ గమ్ ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోలేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. రివ్యూలు, టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉండటం టీంకి షాక్ ఇస్తోంది. సుమ కొడుకు కోసం పబ్లిసిటీలో సెలబ్రిటీలు భాగమయ్యారు. ఈవెంట్లు గట్రా చేశారు. కుర్రాడు చాలా కాన్ఫిడెంట్ గా స్టేజి మీద మాట్లాడాడు. కట్ చేస్తే కామెడీ ప్లస్ యూత్ కంటెంట్ కొంతమేరకు బాగానే ఉన్నా ఫైనల్ గా మెప్పించడంలో దర్శకుడు రవికాంత్ పేరేపు తడబడటంతో వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. దీంతో యూనిట్ ఇలా లాభం లేదని రెండు రోజులు స్టూడెంట్లకు ఉచిత టికెట్ల ఆఫర్ పెట్టేసింది.
డిసెంబర్ ముప్పై, ముప్పై ఒకటో తేదీల్లో వైజాగ్, భీమవరం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లోని ఎంపిక చేసిన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లలో ఫ్రీగా చూసేయొచ్చు. విద్యార్థులు తమ కాలేజీ ఐడి కార్డు తీసుకెళ్తే ముందొచ్చే వాళ్లకు టికెట్లు ఇచ్చేస్తారు. గతంలో మేం ఫేమస్ కి ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. దీని వల్ల అదేమీ బ్లాక్ బస్టర్ కాలేదు కానీ యూత్ కి ఇంకా వేగంగా రీచ్ కావడంలో దోహదపడింది. రైటర్ పద్మభూషణ్ కి లేడీస్ ఉచిత షోలు వేశారు. ఇప్పుడు బబుల్ గమ్ వంతు వచ్చింది. డెవిల్ కూడా చెప్పుకునేంత లేదనే టాక్ రావడంతో ఆ అవకాశం వాడుకోవడానికి చూస్తోంది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇలా ఫ్రీ టికెట్ల స్కీంలు కలెక్షన్లు పెరగడానికి ఉపయోగపడితే మంచిదే కానీ మరీ మూడో రోజే ఇలా ఇచ్చేయడం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద ట్రేడ్ అనుమానంగానే ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సలార్ జోరే కొనసాగుతోంది. వీక్ డేస్ లో కొంత నెమ్మదించినా తర్వాత మళ్ళీ పికప్ చూపిస్తోంది. పైగా రిలీజ్ టైంలో పెంచిన టికెట్ల రేట్లు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. నిజానికి బబుల్ గమ్ కి జనవరి 11 దాకా మంచి ఛాన్స్ ఉంది. ,మధ్యలో రిలీజులేం లేవు. ఇప్పుడేమైనా అనూహ్యంగా పికప్ అయితే మంచిదే.