గుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ చూడొచ్చని పోస్టర్లలో చూపించడం తప్పించి నిజంగా ఏ స్థాయిలో ఉంటుందనేది ఇవాళ వదిలిన చిన్న పాట టీజర్ తో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఒక మీమ్ పేజీలో ముసలాయన చెప్పిన వైరల్ మాటను తీసుకుని ఏకంగా సాంగ్ రాయించి ట్యూన్ కట్టించడం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరిచింది. గతంలో ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఆ వృద్ధుడు అన్న కామెంట్ కొన్ని నెలల క్రితం చాలా వైరలయ్యింది. ఎంతగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏకంగా ఆయన్ని ఇంటర్వ్యూ చేసేంత, వాటికి లక్షల్లో వ్యూస్ వచ్చేంత. ఇక టాపిక్ లోకి వద్దాం.
కుర్చీ మడత బెట్టి ప్రోమో కేవలం కొన్ని సెకండ్లే అయినా ఇప్పుడిది చాలా దూరం వెళ్తోంది. మహేష్ శ్రీలీల డాన్సులకు ఫ్యాన్స్ హుషారెత్తి శివాలెత్తి పోతుండగా మరికొందరేమో స్టెప్పులు ఒకే కానీ లిరిక్స్, ట్యూన్ మీద కంప్లయింట్ వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన యాంకర్ ఏకంగా ఒక వీడియో చేసి మహేష్, తమన్, త్రివిక్రమ్ రేంజ్ వ్యక్తులు తీసుకోవాల్సిన పాట ఇది కాదని చెబుతూ, కుర్చీ మడత పెట్టి తర్వాత ఏంటి డాడీ అని తన కొడుకు అడిగితే చెప్పలేకపోతున్నానని అనడం ట్విట్టర్లో తిరుగుతోంది. దీని మీద సైతం మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
ఈ పాజిటివ్ నెగటివ్ లు కాసేపు పక్కనపెడితే మొత్తానికి మహేష్ లోని రియల్ మాస్ ని త్రివిక్రమ్ బయటికి తీస్తున్నట్టే కనిపిస్తోంది. పోకిరి, ఒక్కడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కమర్షియల్ సినిమా తమ హీరో చేయలేదని అసంతృప్తితో ఉన్న వాళ్లకు పూర్తి ఆకలి తీర్చేలా ఉందని బోలెడు అంచనాలు పెంచేసుకుంటున్నారు. పోటీలో ఎన్ని ఉన్నా మహేష్ కమర్షియల్ స్టామినాని సరిగ్గా వాడుకుని పబ్లిసిటీ చేస్తే హైప్ ఏ రేంజ్ లో వస్తుందో గుంటూరు కారం మరో ఉదాహరణగా నిలుస్తోంది. జనవరి మొదటి వారం చివర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ లాంచ్ చేసేలా సితార టీమ్ ప్లానింగ్ చేస్తోంది.