తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ఆడియన్స్ కి సుపరిచితులైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతూ చెన్నైలోనే చికిత్స తీసుకుంటున్న ఈ అగ్ర నటుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాక శ్వాసకు సంబంధించిన సమస్య తలెత్తి కాలం చేయడం విషాదం. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 1952 ఆగస్ట్ లో జన్మించారు. దశాబ్దాల తరబడి సాగించిన సుదీర్ఘమైన కెరీర్ లో తమిళంలో తప్ప ఇంకే ఇతర భాషల్లో నటించని అతి కొద్ది మంది స్టార్లలో విజయ్ కాంత్ ది ప్రత్యేకమైన స్థానం.
అభిమానులు కెప్టెన్ అని ప్రేమగా పిలుచుకునే విజయ్ కాంత్ 1979 ఇనిక్కుమ్ ఇలామైతో తెరంగేట్రం చేశారు. అందులో విలన్ గా కనిపిస్తారు. ఆ తర్వాత రెండు మూడేళ్లు వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరయ్యారు. 1980 విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన దూరతు ఇడి ముజక్కంతో తొలి బ్రేక్ అందుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సి అవసరం పడలేదు. 1989 సూపర్ హిట్ మూవీ పోలీస్ అధికారితో మనకు దగ్గరైన విజయ్ కాంత్ ఆ మరుసటి ఏడాది కెప్టెన్ ప్రభాకర్ రూపంలో తెలుగులో డబ్బింగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తర్వాత చాలా సినిమాలు అనువాదమయ్యాయి.
2005లో డిఎండిజె(దేశీయ ముర్చొక్కు ద్రావిడ కళగం)పార్టీని స్థాపించినా రాజకీయాల్లో విజయవంతం కాలేకపోయారు. ఒక్క సీట్ మాత్రమే గెలుపొందారు. 2011 ఎమ్మెల్యేగా తమిళనాడు పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించారు. భార్య పేరు ప్రేమలత. వీరిది ప్రేమ వివాహం. విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్ ఇద్దరు సంతానం. రెండో కొడుకుని హీరో చేశారు కానీ అతను నిలదొక్కుకోలేదు. నల్లని రూపం ఉన్నా గంభీరతతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విజయ్ కాంత్ లేకపోవడం తారలోకానికి తీరని లోటే. అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుని కన్నీరు మున్నీరవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates