కార్పొరేట్ బుకింగ్స్ వెనుక స్కాములు నిజమే

సినిమా కలెక్షన్లు గురించి మాట్లాడుకునే టైంలో సాధారణంగా బాలీవుడ్ లో ఎక్కువగా కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట వినిపిస్తుంది. దీని మీద సామాన్య ప్రేక్షకులకు అంతగా అవగాహన ఉండదు కానీ ట్రేడ్ వర్గాలకు సుపరిచితమే. తాజాగా యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా దీని గురించి నోరు విప్పారు. తమ చిత్రం ఇంకా వెయ్యి కోట్లు అందుకోలేదని, ఒకవేళ కార్పొరేట్ బుకింగ్ పద్దతిని అనుసరించి ఉంటే మాకూ ఆ మైలురాయి దక్కేదని, నిజాయితీగా ఉండాలనుకోవడం వల్లే అలాంటివి చేయలేదని చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ పదానికి అర్థమేంటనే సందేహం రావడం సహజం.

నార్త్ లో ఎక్కువగా దీన్ని ఫాలో అవుతారు. అంటే ఏదైనా పెద్ద హీరో మూవీ రిలీజైనప్పుడు ఒకవేళ దానికి బజ్ తక్కువగా ఉన్నా, ఓపెనింగ్స్ పెద్దగా రావనే అనుమానం వచ్చినా వెంటనే బల్క్ బుకింగ్స్ కి తెరతీస్తారు. ఉదాహరణకు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ తన సంస్థలో పని చేసే ఓ అయిదు వేల మంది ఉద్యోగులకు ఫ్రీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకుంటుంది. దీనికి డబ్బులు ఎవరిస్తారంటే సదరు నిర్మాత లేదా హీరోకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వాళ్ళ దగ్గరి నుంచి వస్తుంది. ఫలితంగా ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం హౌస్ ఫుల్స్ కనిపిస్తాయి.

ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఉచితంగా లేదా డిస్కౌంట్లతో టికెట్లు అమ్ముడుపోయే మార్గాలకు తెరతీస్తారన్న మాట. పెద్ద పెద్ద మల్టీప్లెక్సుల్లో ఈ ట్రెండ్ అధికంగా ఉంటుంది. లోపాయికారి ఒప్పందాలు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా పని కనిస్తారు.బయటి వాళ్లకు ఇదంతా కనిపించని వ్యవహారం. బాలీవుడ్ బడా నిర్మాతలు ఇందులో ఆరితేరి పోయారనే కామెంట్స్ బయ్యర్ వర్గాల్లో ఓపెన్ గానే వినిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రణయ్ ఓపెన్ గా దీని మీద కామెంట్ చేయడం చూస్తే ఏ స్థాయిలో ఇదంతా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.