మెగాభిమానులు ఎదురు చూసి చూసి ఆఖరికి ఆలోచించడమే మానేసిన రామ్ చరణ్ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. నిన్న సలార్ ప్రీమియర్ చూసి బయటికి వస్తున్న సందర్భంగా ఒక అభిమాని గుంపులో నుంచి మా సినిమా రిలీజ్ ఎప్పుడని అడగటం, ఆయన స్పందిస్తూ సెప్టెంబర్ అని చెప్పింది మైకులో స్పష్టంగా వినిపించడం జరిగిపోయాయి. ఒకవేళ రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశం లేకపోతే వినిపించనట్టు వెళ్ళిపోయేవారు కానీ అదే పనిగా నెల పేరుని నొక్కి చెప్పడం చూస్తే ఖరారు అని అనుకోవచ్చు.
ఎస్విసి నుంచి అనఫీషియల్ గా అందుతున్న అప్డేట్ ప్రకారం గేమ్ ఛేంజర్ ని 2024 సెప్టెంబర్ 6న తీసుకురాలని ప్రాధమికంగా ఫిక్స్ అయినట్టు తెలిసింది. దర్శకుడు శంకర్ కూడా అంగీకరించారట. ఇండియన్ 2 ఏప్రిల్ లేదా ఆగస్ట్ ఈ రెండు నెలల మధ్యలో ఏదో ఒకదానికి లాక్ చేయడం ఖాయమే కాబట్టి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయించి ఫస్ట్ కాపీ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే 2025 సంక్రాంతికి మాత్రమే గేమ్ ఛేంజర్ వస్తుందని నిరాశ పడిన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్టే. అధికారికంగా అయితే చెప్పలేదు.
సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పండగ ఉంది. ఎలాగూ బాక్సాఫీస్ పరంగా అది మంచి నెలే కాబట్టి ఓపెనింగ్స్, వసూళ్ల పరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. తమన్ పాటలు జనవరి నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేసే అవకాశముంది. గత కొన్ని నెలలుగా దిల్ రాజుని గేమ్ ఛేంజర్ గురించి అడిగినప్పుడంతా శంకర్ మీదకు తోసేసి స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు తప్ప ఫలానా టైం అని చెప్పలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ పీరియాడిక్ డ్రామాలో ఎస్జె సూర్య విలన్ గా నటించాడు. చూస్తుంటే చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఇంకో పది నెలల్లో తీరిపోయేలానే ఉన్నాయి.