రెండోసారి దెబ్బ కొట్టిన ప్రశాంత్ నీల్

దర్శకుడు ప్రశాంత్ నీల్ ని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండోసారి తక్కువ అంచనా వేయడం మరోసారి మూల్యాన్ని చెల్లించేలా చేస్తోంది. 2018 డిసెంబర్లో కెజిఎఫ్ చాఫ్టర్ 1 రిలీజైనప్పుడు అదే సమయంలో కింగ్ ఖాన్ – అనుష్క జంటగా నటించిన జీరో వచ్చింది. శాండల్ వుడ్ మూవీ కాబట్టి తేలిగ్గా తీసుకున్న నార్త్ బ్యాచ్ కళ్ళు బైర్లు కమ్మాయి. ప్రాంతీయ బాషల కన్నా ఎక్కువగా హిందీ మార్కెట్ లో రాఖీ భాయ్ సృష్టించిన సంచలనం ముందు ఓవర్ క్లాస్ కంటెంట్ తో వచ్చిన జీరో నిలవలేకపోయింది. దెబ్బకు షారుఖ్ మూడేళ్ళ గ్యాప్ తో మేకప్ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.

కట్ చేస్తే 2023లో అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. డంకీకి పోటీగా సలార్ రావడం చూసి ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్లు కొంత ఖంగారు పడ్డారు. కారణం రాజ్ కుమార్ హిరానీ తీసింది మసాలా సినిమా కాకపోవడమే. అయినా సరే షారుఖ్ వెనుకడుగు వేయకూడదని ఒక రోజు ముందు రావాలని డిసైడ్ అయ్యాడు. తీరా చూస్తే యావరేజ్ కంటెంట్ ఉన్నప్పటికీ డిజాస్టర్ దిశగా డంకీ ప్రయాణిస్తోందని ట్రేడ్ టాక్. మొదటి రోజు కనీసం నలభై కోట్లు తేలని పరిస్థితిలో ఇంతకన్నా ఆశించలేమని అంటున్నారు. 21న సలార్ స్క్రీన్లన్నీ డంకే ఇచ్చినప్పటికీ వాటిని వాడుకోలేకపోయింది.

ఇంకా సలార్ ఏ స్థాయి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ దేశవ్యాప్తంగా ట్రెండ్ చూస్తే ప్రభాస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. షారుఖ్ కు మాములుగా నైజాంలో మంచి బిజినెస్, ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఈసారి రాలేదు. సలార్ చూడాలని నిర్ణయించుకున్న ఆడియన్స్ డంకీని లైట్ తీసుకున్నారు. టాక్ బయటికి వచ్చాక ఓటిటిలో చూద్దామని సైలెంటయ్యారు. ఇలా ఆరేళ్ళ గ్యాప్ లో రెండు సార్లు పోటీకి తలపడి ప్రశాంత్ నీల్ ని గెలవలేకపోయాడు షారుఖ్ ఖాన్. వీకెండ్ ప్లస్ ఆదివారం మీద భారీ ఆశలున్నాయి కానీ మరీ అద్భుతాలు ఆశించడానికి మాత్రం లేదు.