ఉగ్రమ్ మూలకథకు కెజిఎఫ్ ట్రీట్మెంట్

ఇంకో ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ వ్యవధిలో సలార్ ప్రీమియర్లు పడుతున్న టైంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కొక్క షాకింగ్ విషయాలను బయట పెడుతున్నారు. ఆయన డెబ్యూ కన్నడ మూవీ ఉగ్రంకి ఇది రీమేకన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఒక ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని దాదాపు కన్ఫర్మ్ చేశాడు. అయితే షూటింగ్ ఊపందుకున్నాక ఆ సంగతి అందరూ మర్చిపోయారు. ట్రైలర్ వచ్చాక కొన్ని పోలికలు కనిపించిన మాట వాస్తవమే కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపులో పక్కకెళ్లింది.

ఇప్పుడు స్వయంగా ప్రశాంత్ నీలే సలార్ మూల కథ ఉగ్రం నుంచి తీసుకున్నదేనని, కానీ 2014లో థియేట్రికల్ గా ఆ కంటెంట్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి చేరలేకపోవడంతో కెజిఎఫ్ లాంటి కాన్వాస్ ఇచ్చి డ్రామాని పెంచి ఈ రూపానికి తీసుకొచ్చానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉగ్రంలో నటించిన శ్రీమురళి అందులో మెకానిక్ గా నటించడం, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం మాఫియా పునాదులను కదిలించడం లాంటివి హైలైట్స్ గా నిలిచాయి. సలార్ లో ప్రభాస్ తన ఫ్రెండ్ పృథ్విరాజ్ సుకుమారన్ కోసం చేసేది కూడా ఇదే. కాకపోతే బ్యాక్ డ్రాప్, సెటప్ మొత్తం భారీ ఎత్తున కెజిఎఫ్ రేంజ్ లో ఉంటాయి.

ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది వెల్లడించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయినా కొన్ని గంటల వ్యవధిలో రిలీజ్ ఉండగా ఇలా చెప్పడం పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తున్నా ఒకరకంగా ముందే ప్రిపేర్ చేయడం కూడా మంచిదే. ఎలాగూ సినిమా చూశాక మ్యాటర్ అర్థమైపోతుంది. కానీ రీమేక్ కాదని మాత్రం నొక్కి వక్కాణిస్తున్నారు నీల్. ఈ థియరీల సంగతి ఎలా ఉన్నా సలార్ ఫీవర్ కనక అంచనాలు నిలబెట్టుకుంటే మాత్రం ప్రభాస్ చేయబోయే బాక్సాఫీస్ ఊచకోత ఖాయంగా కనిపిస్తోంది.