సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రజనీకాంత్

పండగ బరిలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని బయ్యర్లు కిందా మీద పడుతున్న టైంలో మరో మూడు తమిళ డబ్బింగ్ చిత్రాలకు ఎలా సర్దుబాటు చేయాలనే టెన్షన్ వాళ్లలో లేకపోలేదు. ఊరట కలిగించేలా రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ ని సంక్రాంతి రేసు నుంచి తప్పించినట్టు లేటెస్ట్ అప్డేట్. అదే సీజన్ కు అల్లుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కావడం ఒక కారణమైతే ఇతర భాషల్లో ముఖ్యంగా తెలుగులో విపరీతమైన పోటీ మధ్య నలిగిపోవడం ఖాయమని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే శివ కార్తికేయన్ అయలన్ మాత్రం బరిలోనే ఉంది.

నిజానికి లాల్ సలామ్ మీద ఆశించిన స్థాయిలో బజ్ లేదు. కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం, రజనిది క్యామియోనా లేక ఎక్కువ సేపు కనిపించే ప్రాధాన్యత ఉన్న పాత్రా క్లారిటీ లేదు. హీరో విష్ణు విశాలనే రేంజ్ లో షూటింగ్ టైంలో ప్రమోషన్ చేసుకున్నారు. తీరా జైలర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా లాల్ సలామ్ కు తమిళనాట డిమాండ్ వచ్చింది. అయితే క్లాష్ లో రావడం సేఫ్ కాదని, అనవసరంగా బిజినెస్ ని తగ్గించుకోవడం అవుతుందని భావించడంతో ఫైనల్ గా డ్రాప్ అయ్యారు. అందుకే ఇకపై ప్రమోషన్లకు సైతం బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలిసింది.

విక్రమ్ తంగలాన్ ఎలాగూ జనవరి 26 నుంచి వేసవికి వెళ్తోంది కాబట్టి ఖాళీ ఆయిన ఆ డేట్ ని లాల్ సలామ్ కి వాడుకోవచ్చు. తెలుగులో జైలర్ దెబ్బకు రజని మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. కబాలి నుంచి పెద్దన్న దాకా ప్రతి సంవత్సరం అంతకంతా కిందకే వెళ్తున్న బిజినెస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే లాల్ సలామ్ ని నిర్మాణ సంస్థ లైకా జాగ్రత్తగా డీల్ చేస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాలో రజని ఒక ముస్లిం లీడర్ గా కనిపిస్తున్నారు. ఇలాంటి ఫుల్ లెన్త్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి.