మల్టీప్లెక్సుల అడ్డుకట్టను సలార్ తెంచుకుంటాడా

రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి మారిపోయిన సలార్ విడుదల దగ్గరపడే కొద్దీ స్క్రీన్ బయట కూడా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రెండు కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన మల్టీప్లెక్సుల్లో టికెట్ల అమ్మకాలు ఇంకా షురూ కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో సరిపడా షోలు, థియేటర్లు ఇవ్వని కారణంగా ఈ రెండు కంపెనీలకు చెందిన సముదాయాల్లో సలార్ ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించినట్టుగా వచ్చిన వార్తలు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

సమస్యల్లా డంకీతో వచ్చింది. ఆశించిన స్థాయిలో భారీ బజ్ లేకపోయినా ఎక్కువ షోలు దానికే కేటాయించడం వాళ్ళ సలార్ నష్టపోతోందని హోంబాలే టీమ్ వాదన. ఇది అధికారికంగా ధృవీకరించిన సమాచారం కాకపోయినా ఏపీ, తెలంగాణ బుక్ మై షో, పేటిఎంలో ఎక్కడా సదరు మల్టీప్లెక్స్ బుకింగ్స్ లేకపోవడంతో నిజమనేందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ముంబై లాంటి ప్రధాన నగరాల్లో చాలా సింగల్ స్క్రీన్లలో డిమాండ్ తో సంబంధం లేకుండా డిసెంబర్ 22 కూడా డంకీనే వేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదనే కామెంట్లో నిజముంది.

ఇదంతా వీలైనంత త్వరగా కొలిక్కి రావాలి. ఎందుకంటే టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇంకా కొనని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇండియాలో పెద్ద మల్టీప్లెక్స్ బ్రాండ్ లేకుండానే గంటకు ముప్పై వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అలాంటిది ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ కార్పొరేట్ సంస్థ వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించుకోవాలి. ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందులు పెరుగుతాయి. ఇదే కనక నిజమైతే డంకీకి తెలుగు రాష్ట్రాల్లో అనధికార బాయ్ కాట్ తప్పకపోవచ్చు. ఇప్పటికైతే నార్త్ కు సంబంధించిన ముఖ్య నగరాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి కానీ అసలు టెన్షన్ సౌత్ లోనే ఉంది.