మహేష్ వెంకటేష్ ఇక ఇద్దరే బాకీ

సంక్రాంతి సినిమాల సందడి ప్రమోషన్ల రూపంలో జోరుగా జరుగుతోంది. ఎవరికి వారు తగ్గదేలే అంటూ విడుదల తేదీలను మళ్ళీ మళ్ళీ హైలైట్ చేసి పబ్లిసిటీ కానిస్తున్నారు. నా సామిరంగ టీజర్ ఒక్కసారిగా మాస్ లో బజ్ తెచ్చేసుకుంది. చాలా గ్యాప్ తర్వాత నాగార్జునని ఇంత కమర్షియల్ లుక్ లో చూడటంతో పండగకు మంచి ఛాయసవుతుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి తగ్గట్టే థియేట్రికల్ బిజినెస్ లో ఊపొచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఈ వారంలోనే టైటిల్ సాంగ్ వదిలి ఆపై ట్రైలర్ రెడీ చేయబోతున్నారు. కామెడీ పరంగా అల్లరి నరేష్ చాలా ప్లస్ అవుతున్నాడు.

ఇక నిన్న వచ్చిన హనుమాన్ లో ప్యాన్ ఇండియా కంటెంట్ ఉందనే క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ నమ్మకం వెనుక కారణం ఏంటో మూడు నిమిషాల వీడియోలో చూపించేశారు. హీరో తేజ సజ్జ ఎన్నడూ లేనంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియా ప్రచారం జరిగి అనుమానాలు రేకెత్తించిన ఈగల్ ఇవాళ వాటిని సంపూర్ణంగా బద్దలు కొడుతూ సాలిడ్ ట్రైలర్ తో విజువల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేశారు. యాక్షన్, మాస్, సస్పెన్స్ అన్ని కలగలిసిన కంప్లీట్ ఎంటర్ టైనరనే అభిప్రాయం కలిగించడంలో సక్సెసయ్యారు.

ఇక మిగిలింది మహేష్ బాబు, వెంకటేష్. గుంటూరు కారం ఒక పాట హిట్ కాగా రెండోది ట్రోలింగ్ బారిన పడింది. టీజర్ లేదా ట్రైలర్ తో అన్నింటికి సమాధానం చెప్పే క్షణం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక సైంధ‌వ్‌ సాంగ్స్ పెద్దగా మేజిక్ ఏమీ చేయలేకపోయాయి. టీజర్ లో వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. ట్రైలర్ వచ్చాక కథాకమామీషు గురించి స్పష్టత వస్తుంది. నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడుతున్న పందెం కోళ్లు రాబోయే రోజుల్లో పబ్లిసిటీలోనూ అదే రకంగా తలపడనున్నాయి. సలార్ హడావిడి కాస్త తగ్గాక రోజూ పండగ సినిమాల అప్డేట్స్ తో ఉక్కిరిబిక్కిరి కావలసిందే.