మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకు కూడా మంచి ఎనర్జీ ఇస్తుందనే స్థాయిలో అంచనాలుంటాయి. ధమాకా, వాల్తేర్ వీరయ్య వరస బ్లాక్ బస్టర్ల తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు నిరాశపర్చడంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఈగల్ మీదే ఉన్నాయి. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా సరే సంక్రాంతికి వచ్చి తీరాలని ఫిక్స్ అయిపోయిన టీమ్ జనవరి 13న రావడం ఖాయమని ప్రమోషన్లలో నొక్కి చెబుతోంది. ఎడిటర్ కం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఇది రెండో సినిమా. ట్రైలర్ ద్వారా ఈగల్ లో కంటెంట్ ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు.
అతనో అజ్ఞాత శక్తి(రవితేజ). ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఓ అమ్మాయి(అనుపమ పరమేశ్వరన్) వెతుకుతూ వెళ్తుంది. సాయంగా వస్తాడో వ్యక్తి(నవదీప్). పక్కదేశంలో శత్రువులు, అడవుల్లో నక్సలైట్లు, ప్రభుత్వాలు, పోలీసులు అందరూ ఇతని వేటలోనే ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. ఒక ఊరికి దేవుడిగా ఆరాధించబడే ఈగల్ అసలు ఎందుకు ఇంత అరాచక శక్తిగా మారాడు, ప్రేమించిన భార్యతో విదేశాల్లో అందమైన జీవితాన్ని గడిపిన మనిషి ఎందుకు కిరాతకంగా మారాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈగల్ ని కలుసుకోవాలి.
విజువల్స్ ని చాలా హై స్టాండర్డ్ లో తీర్చిదిద్దాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. స్టోరీని ఎక్కువ రివీల్ కానివ్వకుండా జాగ్రత్తగా ట్రైలర్ ని కట్ చేసిన విధానం బాగుంది. రవితేజ మూడు నాలుగు షేడ్స్ లో డిఫరెంట్ గా కనిపిస్తుండగా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఇందులో భాగం పంచుకున్నారు. కావ్య థాపర్ మెయిన్ హీరోయిన్. డవ్ జాండ్ నేపధ్య సంగీతం, కార్తీక్-కమిల్-కర్మ్ సంయుక్త ఛాయాగ్రహణంలో క్వాలిటీ తొణికిసలాడింది. అంచనాలు రేపడంలో ఈగల్ బృందం సక్సెసయ్యింది. పండగ బరిని మరింత వేడెక్కిస్తూ పక్కా యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో రాబోతున్నాడు మాస్ రాజా.
Gulte Telugu Telugu Political and Movie News Updates