ప్రభాస్ అభిమానులకు పవన్ ఫ్యాన్స్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలార్ కు మొదటి పది రోజులు టికెట్ మీద కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంత మాత్రం నచ్చడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో సినిమా బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని వంద రూపాయలకు పచ్చ జెండా ఊపినప్పుడు ఇక్కడ కనీసం సగం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల ఓపెనింగ్ ఫిగర్స్ మీద ప్రభావం పడుతుంది. ప్రభాస్ కు పట్టున్న ఆంధ్ర, కోనసీమ, కృష్ణా తదితర ప్రాంతాల్లో వసూళ్లు భారీగా ఉన్నా తన రేంజ్ కు తగ్గ సంఖ్య కనిపించకపోయే రిస్క్ ఉంది. జరగబోయేది కూడా అదే.

ఇక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ అభిమానులకు మద్దతు ఇస్తున్నారు. ఇంత తక్కువ పెంచారని ఫీలవ్వడం న్యాయమేనని, భీమ్లా నాయక్ టైంలో ఏకంగా రెవిన్యూ అధికారులను పెట్టి యాభై, పది రూపాయలకు టికెట్లు అమ్మించినప్పుడు మా బాధ ఇంతకు రెట్టింపు ఉండేదని గుర్తు చేస్తున్నారు. పైగా పేదవారికి వినోదం దూరం కాకూడదని మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ కబుర్లు చెప్పారని, ఇప్పుడు సలార్ కు కంటితుడుపు పెంపు సరికాదని అంటున్నారు. వాళ్ళ వెర్షన్ లో పాయింట్ ఉంది. భీమ్లా, సలార్ లు ఇంచుమించు ఒకే సమస్యను ఎదురుకోవడం వల్ల పరస్పర సపోర్ట్ దక్కుతోంది.

పవన్ ఫ్యాన్స్ చెబుతున్న లాజిక్ ప్రభాస్ అభిమానులు అర్థం చేసుకుని నిజమే అంటున్నారు. ఏపీ బుకింగ్స్ నిన్న రాత్రి నుంచి మొదలయ్యాయి. హైదరాబాద్ తరహాలో కౌంటర్ అమ్మకాలు లాంటి ప్రయోగాలకు వెళ్లకుండా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. అర్ధరాత్రి షోలు ఉంటాయా లేదా అనే దాని గురించి క్లారిటీ లేదు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కలెక్టర్ల నుంచి ఉత్తర్వులు రాగానే చెబుతామని అంటున్నారు. ఒకవేళ అవి రాకపోతే మాత్రం ఉదయం 4 తర్వాత తప్ప అంతకన్నా ముందు షోలు పడే ఛాన్స్ ఏపీలో ఉండకపోవచ్చు. ప్రతి పరిణామం సినిమాకు మించిన మలుపులాగా అనిపిస్తోంది.