సంక్రాంతి దగ్గరపడే కొద్దీ రిలీజయ్యే సినిమాల తాలూకు కంటెంట్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ హనుమాన్ ట్రైలర్ వచ్చాక తేజ సజ్జ లాంటి చిన్న హీరోతో ఎందుకు రిస్క్ చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ మాది చిన్న చిత్రమే అయినా అందరికన్నా పెద్ద హీరో హనుమంతుడు అండగా ఉన్నాడనే ధైర్యంతో దిగుతున్నట్టు చెప్పేశాడు. అంతే కాదు తెలుగులో 400 థియేటర్లు దొరికితే హిందీలో 1500 పైగా స్క్రీన్లలో హనుమాన్ విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని సెలవిచ్చాడు. తెలుగులో మరిన్ని జోడించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నటీనటులతో సహా టీమ్ మొత్తం హాజరైన ఈ వేడుకలో ప్రోడక్ట్ మీద టీమ్ కున్న నమ్మకం మరోసారి స్పష్టమైంది. జనవరి 12 గుంటూరు కారం ఉంది కాబట్టి ముందో వెనుకో మార్చుకుంటారనే కామెంట్స్ కి చెక్ పెడుతూ అదే డేట్ ని కన్ఫర్మ్ చేసేశారు. వచ్చే నెల నుంచి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకరకమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. దానికి తగ్గట్టే హనుమాన్ లో భక్తి పూర్వక అంశాలతో పాటు పిల్లా పెద్దాను ఆకట్టుకునే సాహసాలు, గ్రాఫిక్స్, దైవబలం గొప్పదనం తదితరాలు ఉండటంతో ఖచ్చితంగా సినిమాకు ఇవన్నీ ఉపయోగపడతాయి.
ముందు మేము డేట్ ప్రకటించి ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల గుంటూరు కారంతో క్లాష్ తప్పని పరిస్థితిలో తలెత్తిందనే క్లారిటీ కూడా ఈ సందర్భంగా ఇచ్చేసారు. సో మార్పు లేదని అర్థమైపోయింది. ప్రశాంత్ వర్మ కెరీర్ లోనే కాదు దీనికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. పది భాషల్లో ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. హనుమాన్ థియేటర్లో అడుగుపెట్టిన సరిగ్గా పది రోజులకు రాముడి గుడి తలుపులు తెరుచుకుంటాయి. అది కూడా సెంటిమెంట్ గా భావిస్తున్నారు నిర్మాతలు. రీజనబుల్ బడ్జెట్ లోనూ ఇంత క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తేవడం విశేషమే.