యానిమల్ మూవీకి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ దృష్ట్యా ఆ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వస్తాయని తెలుసు. కానీ ఈ చిత్రం మరి ఈ స్థాయిలో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ లాంటి లాంటి భారీ చిత్రాల రేంజిలో ఈ చిత్రం ఓపెనింగ్ సాధించింది. ఇది పై చిత్రాల స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కానప్పటికీ, ఎంతో నెగిటివిటీ ఎదుర్కొన్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గలేదు.
వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయింది. ఇండియాలో ఇప్పటికే అడల్ట్ రేటెడ్ మూవీస్ లో అన్ని రికార్డులను యానిమల్ బద్దలు కొట్టేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓ సంచలన ఘనతను సాధించింది.
ఇండియాలో 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన అరుదైన చిత్రాల జాబితాలో యానిమల్ స్థానం సంపాదించింది. ఇప్పటిదాకా 6 చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. బాహుబలి 2 తొలిసారిగా ఈ ఎలైట్ క్లబ్ లో అడుగు పెట్టగా.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్-2, పఠాన్, గదర్ 2, జవాన్ ఈ క్లబ్ లోకి వచ్చాయి. ఇప్పుడు యానిమల్ కూడా ఇండియాలో 500 కోట్ల నెట్ వసూళ్ల మైలురాయిని అందుకుంది.
బాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో చిత్రం ఇది. యానిమల్ హిందీ వర్షన్ మాత్రమే 450 కోట్ల మేర వసూళ్లు సాధించడం విశేషం. మిగతా 50 కోట్లు ఇతర భాషల నుంచి వచ్చాయి. ఈ ఎడాది ముందు వరకు బాలీవుడ్ కు ఒక్క 500 కోట్ల నెట్ కలెక్షన్ మూవీ కూడా లేదు. కానీ ఈ ఒక్క ఏడాదిలోనే బాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు 500 కోట్ల మైలురాయిని అందుకోవడం విశేషం. ఓవరాల్ గా యానిమల్ వరల్డ్ వైడ్ వసూళ్లు 900 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి.