తెలుగు ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ థియేటర్లు, టీవీ, ఓటిటి, స్మార్ట్ ఫోన్లలో లెక్కలేనన్ని చూసేసి ఇక చాలని సెలవు కూడా ఇచ్చారు. ఎప్పుడైనా శాటిలైట్ ఛానల్ లో వచ్చినా ఆ చూసిందే కదానే నిట్టూర్పుతో లైట్ తీసుకుంటున్నారు. కానీ జపాన్ జనాలు మాత్రం ఇప్పట్లో ఈ ఫీవర్ ని వదిలేలా లేరు. గత ఏడాది నాన్ స్టాప్ గా వంద రోజులు ఆడించినా కూడా వాళ్ళ మోజు తీరలేదు. రానున్న జనవరి 5 ఫ్రెష్ గా మళ్ళీ సరికొత్త ఐమాక్స్ ప్రింట్లతో మళ్ళీ విడుదల చేయబోతున్నారు. విచిత్రం ఏంటంటే మెయిన్ స్క్రీన్స్ బుకింగ్స్ పెడుతుంటే టికెట్లు చాలా వేగంగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి.
జపాన్ లో ఇప్పటిదాకా విడుదలైన ఇండియన్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ నెంబర్ వన్ గా ఉంది. గతంలో ఉన్న ముత్తు రికార్డుని బద్దలు కొట్టి సింహాసనం స్వంతం చేసుకుంది. అక్కడి ఆడియన్స్ కి మన కంటెంట్ కనెక్ట్ అవ్వాలే కానీ నెత్తిన పెట్టుకుంటారని చాలా సార్లు రుజువయ్యింది, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు స్వతంత్ర సమరయోధుక కాల్పనిక కథని రాజమౌళి చూపించిన తీరు జపాన్ పబ్లిక్ ని పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. దాని ఫలితంగానే రెండేళ్ల తర్వాత కూడా ఈ స్థాయి స్పందన కనిపిస్తోంది.
ఇది జక్కన్న ఘనతే. ఆర్ఆర్ఆర్ వల్లే నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ హైదరాబాద్ వచ్చినప్పుడు అదే పనిగా టాలీవుడ్ బడా స్టార్లు అందరినీ కలిసి భోజనాలు కాఫీ టీలు లాగించాడు. కొందరితో ఒప్పందాలు, ప్రతిపాదనలు కూడా జరిగాయి. వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ వందల మిలియన్ల వ్యూస్ తెచ్చి నెట్ ఫ్లిక్స్ రీచ్ కి చాలా ఉపయోగపడింది. తెలుగు ఒరిజినల్ వెర్షన్ లేకపోయినా ఇంత ఆదరణ దక్కడం చూసి ఆ ఓటిటి వర్గాలు ఆశ్చర్యపోయాయి. అమెరికాలోనూ అడపాదడపా రెండు నెలలకోసారి షోలు వేస్తున్నారు. ఆస్కార్ వచ్చాక ట్రిపులార్ క్రేజ్ విదేశీయుల్లో విపరీతంగా పెరిగిందన్నది నిజం.