విపరీతమైన పోటీ ఒత్తిడి ఉన్నప్పటికీ తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలో దిగుతున్న హనుమాన్ క్రేజ్ భారీగానే ఉన్నట్టు బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి. ట్రేడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 22 కోట్లకు అమ్మినట్టు సమాచారం. తేజ సజ్జ మార్కెట్ కోణంలో చూసుకుంటే ఇది చాలా భారీ మొత్తం. ఎందుకంటే ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ హీరోలకే బయ్యర్లు ఈ ఫిగర్లను కోట్ చేస్తారు. అలాంటిది సరైన హిట్టే లేని ఓ లేత కుర్రాడి మీద ఇంత పెట్టుబడి రిస్కే. అయితే ఇది తేజ గొప్పదనం కాదు. హనుమాన్ బ్రాండ్ మీదున్న సెంటిమెంట్ ప్లస్ నమ్మకం.
అంతర్గతంగా వినిపిస్తున్న వెర్షన్ ప్రకారం హనుమాన్ ట్రైలర్ ని ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు చూశాకే వాళ్లకు సినిమా మీద నమ్మకం వచ్చిందట. దీని కన్నా ముందు గుంటూరు కారంతో నేరుగా అదే రోజు తలపడటం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తే మొదటి రోజు ఓపెనింగ్స్ కన్నా తర్వాత సునామిలాగా పెరిగే వసూళ్ల మీద నమ్మకం పెట్టమని నిర్మాతలు ఒప్పించి మరీ ఫుటేజ్ చూపించారట. దీంతో రెండు రోజులు కలెక్షన్లలో కొంత కోత పడినా ఓ మూడు షోలు పూర్తవ్వడం ఆలస్యం పికప్ అనూహ్యంగా ఉంటుందనే నమ్మకం వచ్చేసిందట. నార్త్ పంపిణీదారులకు ఇదే స్ట్రాటజీ వాడబోతున్నారు.
సో దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు నుంచి చెబుతున్నట్టు హనుమాన్ రచ్చ మాములుగా ఉండేలా లేదు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో వినయ్ వర్మ విలన్ కాగా వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి సినిమాల్లో వేగంగా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంది హనుమానే. ఆడియోకు పెద్దగా రీచ్ రానప్పటికీ 19న రిలీజ్ చేయబోయే ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా జనాల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతాయని అంటున్నారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవచ్చనే వార్త తిరుగుతోంది కానీ నిర్మాతలు మాత్రం వాటిని ఖరాఖండిగా కొట్టి పారేస్తున్నారు.