ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న సలార్ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో భాగమైనందుకు హీరోయిన్ శృతి హాసన్ కు అంత ఎగ్జైట్ మెంట్ ఉన్నట్టు కనిపించడం లేదు. రిలీజ్ ఇంత దగ్గర్లో పెట్టుకుని కూడా ప్రమోషన్లలో భాగం కావడం లేదు. అఫ్కోర్స్ ఇంకా హీరోనే బయటికి రానప్పుడు తనను అడగటం న్యాయం కాదు కానీ మాములుగా కొత్త రిలీజులప్పుడు ఎంతో కొంత హడావిడి చేయడం శృతి హాసన్ కు మాములే. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టైంలో ఇది గమనించాం. కానీ సలార్ విషయంలో మాత్రం అలాంటి చొరవ తీసుకున్నట్టు కనిపించడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సలార్ లో శృతికి పెద్దగా ప్రాధాన్యం లేదట. కథ ప్రకారం ఫోకస్ మొత్తం ప్రభాస్, పృథ్విరాజ్ ల మీదే ఉండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదని వినికిడి. ట్రైలర్ లో కూడా జస్ట్ ఒక షాట్ కి మాత్రమే పరిమితం చేశారు. కమర్షియల్ ఫార్మట్ లో డ్యూయెట్లు కూడా పెట్టలేదని సమాచారం. అలాంటప్పుడు శృతికి అదే పనిగా ప్రమోట్ చేయడానికి మెటీరియల్ ఏముందని. వీలైతే ఈ వారంలో టీమ్ మొత్తం కలిసి ఒక కామన్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు కానీ అదెంత వరకు కార్యరూపం దాలుస్తుందో వచ్చే దాకా చెప్పలేని పరిస్థితి.
ఇది ఎంత బ్లాక్ బస్టర్ అయినా శృతికి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కెజిఎఫ్ వచ్చాక శ్రీనిధి శెట్టి కెరీర్ అమాంతం ఊపందుకోలేదు. చాలా నెమ్మదిగా అవకాశాలు వచ్చాయి. ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ని పీక్స్ లో ఎంజాయ్ చేసిన శృతి హాసన్ కి ఇప్పుడు కొత్తగా హిట్లు ఫ్లాపు వల్ల వచ్చేదేమీ లేదు. 22న రాబోతున్న సలార్ లో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్లంటే శృతి తర్వాత ఈశ్వరి రావుదే. మొత్తం మగాళ్లు, మెషీన్ గన్లతో తెరను నింపేసే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో, విలన్ తప్ప మిగిలినవాళ్లు ఆశించేందుకు పెద్దగా ఏముండదు. చూడాలి సలార్ 1 సీజ్ ఫైర్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో.