హరిహర వీరమల్లు అడుగు ముందుకు

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన ఫ్యాన్ ఇండియా మూవీగా మొదలైన హరిహర వీరమల్లు మూడు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉండేసరికి ఫ్యాన్స్ కి విసుగొచ్చి దాని గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు. దర్శకుడు క్రిష్ వేరే స్క్రిప్ట్ రాసుకోడంలో బిజీ అయ్యాడనే టాక్ కూడా వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం మాత్రం కనిపించినప్పుడంతా త్వరలో విడుదల, ఎన్నికల ముందు రిలీజ్ అంటూ ఊరించడమే కానీ ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఏవో చిన్న సినిమాల టీజర్ లాంచులప్పుడు కనిపించడం తప్ప మీడియాకి క్రిష్ అసలు దొరకడమే లేదు.

ఇదిలా ఉండగా వీరమల్లు కోసం ఏఏం రత్నం గారబ్బాయి జ్యోతికృష్ణ రంగంలోకి దిగినట్టు సమాచారం. కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ తీస్తున్న టైంలో బిజీగా ఉండటం వల్ల నాన్న సినిమా వ్యవహారాలు పట్టించుకోలేదని, ఇప్పుడు బడ్జెట్ తో సహా అన్ని విషయాలు చేయి దాటిపోవడంతో స్వయంగా చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. డైరెక్షన్ చేయకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయించడంతో పాటూ బాలన్స్ ఉన్న నలభై రోజుల షూటింగ్ కు సంబంధించిన ఖర్చులు, షెడ్యూల్స్, ఆర్టిస్టుల కాల్ షీట్లు తదితరాలన్నీ రివ్యూ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఒకవేళ ఇది నిజమైతే మంచిదే కానీ టైం అయితే చాలా పడుతుంది. పవన్ ప్రస్తుతం షూటింగులకు స్వస్తి చెప్పేసి జనసేన కార్యకలాపాల్లో బిజీ అయిపోయాడు. ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఫలితాలు తేలాక అప్పుడు ఎవరికి ఎన్ని డేట్స్ ఇవ్వాలనేది నిర్ణయించబోతున్నారు. మొదటి ప్రాధాన్యం ఓజికి ఇచ్చి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి చూడాలి. హరిహర వీరమల్లుకి మళ్ళీ హెయిర్ స్టైల్ పెంచాలి కాబట్టి ఆ టైంకి ఇంకెవరికి డేట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఈలోగా సురేందర్ రెడ్డి తన స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ సిద్ధం చేస్తే అది వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కొచ్చు.