ఎన్నో ఆశలు పెట్టుకుని అభిమానులను కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి వస్తారంటూ నితిన్ తెగ ఊరించిన ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ఆశించిన ఫలితం అందుకోలేక ఎదురీదుతోంది. ఇవాళ ఆదివారం కాబట్టి సెలవు రోజును వాడుకుని ఎంతో కొంత రాబట్టుకోవచ్చేమో కానీ రేపటి నుంచి వసూళ్ల మీద బయ్యర్లకు పెద్ద ఆశలేం లేవు. కేవలం ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని వక్కంతం వంశీ స్క్రిప్ట్ ని లోతుగా విశ్లేషించుకోకపోవడం వల్ల వచ్చిన ఫలితమిది. అయితే ఒకసారి ఇలా జరిగితే ఏదో అనుకోవచ్చు. కానీ నితిన్ గత పదేళ్లలో హిట్ లాజిక్ ని మిస్సవుతూ తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు.
దీనికి ముందు వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’లో ఓవర్ మాస్ వెళ్ళిపోయి దెబ్బ తిన్నాడు. అనుభవం లేని దర్శకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా డిజాస్టర్ పడింది. ‘మాస్ట్రో’ ఓటిటిలో వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ థియేట్రికల్ రిలీజ్ అయ్యుంటే ఇంకా ఇబ్బందయ్యేది. ‘రంగ్ దే’ సెలక్షన్ పరంగా వంక పెట్టలేకపోయినా వెంకీ అట్లూరి వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. ఫామ్ లో లేని చంద్రశేఖర్ యేలేటితో ‘చెక్’ చేయడం ఇంకో ఫ్లాప్ ని మూటగట్టింది. ‘భీష్మ’ ఒకటే నితిన్ హ్యాపీగా చెప్పుకునే సూపర్ హిట్. వెంకీ కుడుములకు ఎస్ చెప్పడమొకటే తన బెస్ట్ డెసిషన్.
శ్రీనివాస కళ్యాణం, లై, చల్ మోహనరంగా అన్నీ మిస్ ఫైర్ అయినవే. ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అఆ’ మాత్రమే నితిన్ కి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదంతా గత పదేళ్లలో నితిన్ ట్రాక్ రికార్డు. 2013లో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత సాలిడ్ గా పడిన హిట్లు మూడు మాత్రమే. ‘హార్ట్ అటాక్’ కూడా యావరేజ్. చిన్నదానా నీ కోసం బోల్తా బ్యాచే. ఇప్పుడు నితిన్ విజయం సాధించే భారాన్ని తిరిగి వెంకీ కుడుముల మీదే పెట్టాడు. ఆల్రెడీ హీరోయిన్ మారిపోయి ఇది కూడా కుదుపులకు లోనయ్యింది. ఓపెనింగ్స్ స్థాయిని తగ్గించేసుకున్న నితిన్ ని లిఫ్ట్ చేయాల్సింది, బ్రేక్ ఇవ్వాల్సింది వెంకీనే.