నాన్నా…ఈ ఛాన్స్ వదులుకోవద్దు

రెగ్యులర్ సంప్రదాయానికి భిన్నంగా గురువారమే రిలీజ్ చేయడం హాయ్ నాన్నకు ప్లస్ అవుతోంది. మొదటి రోజు టాక్ కొంత మిశ్రమంగా అనిపించినప్పటికీ క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతున్న తీరు థియేటర్ల ఆక్యుపెన్సీలో కనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు రావడం ప్లస్ అవుతోంది. నిజానికి మొదటి రోజు హాయ్ నాన్నకు బెస్ట్ ఓపెనింగ్ దక్కలేదు. పది కోట్లకు పైగానే గ్రాస్ వచ్చింది కానీ అదేమీ కెరీర్ హయ్యెస్ట్ కాదు. ఈ జానర్ కు సహజంగా మాస్ సులభంగా రారు కాబట్టి కుటుంబాల అండతోనే గట్టెక్కాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కులు ఉన్నాయి.

రెస్పాన్స్ కు తగ్గట్టుగా తగినన్ని స్క్రీన్లు హాయ్ నాన్నకి లేవని ఫ్యాన్స్ కంప్లయింట్. ఉదాహరణకు హైదరాబాద్ నే తీసుకుంటే నాని మూవీ కంటే హిందీ తెలుగు వెర్షన్లు కలిపి యానిమల్ కే ఎక్కువ షోలు వేయడం గమనించాల్సిన విషయం. నాన్నకు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఎనభై శాతం పైగా టికెట్లు తెగుతున్నాయి. దానికి అనుగుణంగా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శనలు పెంచాలి. కానీ పబ్లిక్ డిమాండ్ పేరుతో యానిమల్ ని కొనసాగించడం సరికాదనేది అభిమానుల వెర్షన్. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కాబట్టి అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి.

ఈ వీకెండ్ హాయ్ నాన్నకు చాలా కీలకం. ఎందుకంటే ఆపై వారం ఎంత ఖాళీగా ఉన్నా సరే సలార్, డంకీల కోసం ఉన్న ఎగ్జైట్ మెంట్ వల్ల ఆశించినంత వేగంగా వసూళ్లు ఉండకపోవచ్చు. అందుకే వీలైనంత రాబట్టుకోవడం కీలకం. ఓవర్సీస్ లో అర మిలియన్ మొదటి రోజే అందుకున్న నాన్నకు నాని అక్కడే ఉండి ప్రమోషన్లు చేసుకోవడం హెల్ప్ అవుతోంది. అక్కడ టూర్ పూర్తి చేసుకుని వచ్చాక ఇక్కడి ఆడియన్స్ ని కలిసేందుకు నాని ప్లాన్ చేసుకుంటున్నాడు. నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ టాక్ కూడా నానికి కలిసి వచ్చేలా ఉంది. అయితే థియేటర్ల పంపకంలో మాత్రం ప్రభావం పడింది.