సోగ్గాడి సెంటిమెంట్ కోసం నాగ్ పట్టుదల

పండగని పోస్టర్లలో వేయడం తప్ప నా సామి రంగా ఖచ్చితంగా ఏ డేట్ కి వస్తుందని ఇప్పటిదాకా నిర్మాతలు ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. గత కొన్నేళ్లలో నాగార్జున ఏ సినిమాకు పని చేయనంత ఫాస్ట్ గా దీని కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. హీరోయిన్ ఇంట్రో టీజర్ వచ్చేసింది. మొదటి లిరికల్ వీడియో అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. నాగ్ గెటప్ తాలూకు లుక్ ని రివీల్ చేశారు. షూటింగ్ కు ముందే ట్రైలర్ తరహాలో హీరో ఇంట్రోని చూపించారు. ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతిని మిస్ చేయకూడదనే సంకల్పంతోనే.

సోగ్గాడే చిన్న నాయన విపరీతమైన పోటీలోనూ బ్లాక్ బస్టర్ గా నిలవడం వల్లే నాగార్జున ఆ సెంటిమెంట్ మీద ఇంత పట్టుదలగా ఉన్నారట. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కాంపిటీషన్ లో ఉన్నప్పటికీ చివరిగా వచ్చిన కింగే వాటికన్నా పెద్ద హిట్టు కొట్టారు. బంగార్రాజు టైంలో ఇంత తీవ్రమైన పరిస్థితి లేకపోయినా ఫెస్టివల్ విన్నర్ గా నిలవడం ఫ్యాన్స్ కి గుర్తే. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన నా సామీ రంగాకి మంచి సీజన్ వదులుకోవడం కష్టం లేక యూనిట్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కీరవాణి పాటలు ఎప్పుడో రికార్డింగ్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి

ఫ్యామిలీ స్టార్ ఎలాగూ డ్రాప్ అయ్యింది కాబట్టి నా సామి రంగాకు ఇంకో సానుకూలాంశం తోడయ్యింది. గుంటూరు కారం ఆడియన్స్ కి మొదటి ఛాయస్ గా నిలిచినా సైంధ‌వ్‌ రివెంజ్ డ్రామా, ఈగల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్, హనుమాన్ ఫాంటసీ లాంటి కారణాల వల్ల తన సినిమాకు మాస్ అండగా ఉంటుందని నాగార్జున నమ్మకం. సాంగ్స్ బాగా వచ్చాయని, ఎప్పుడో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వైబ్స్ వినిపించడం ఖాయమని విన్న వాళ్ళు ఊరిస్తున్నారు. ఈ వారం పది రోజుల్లో డేట్ కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం రావడం పక్కా అనే చెప్పారట.