మాములుగా సీనియర్ హీరోలకు ఒక హీరోయిన్ ని సెట్ చేయడమే దర్శకులకు సవాల్ గా మారుతోంది. అలాంటిది ఏకంగా అయిదుగురు కావాలంటే చాలా కష్టం. చిరంజీవితో భారీ ఫాంటసీ మూవీ విశ్వంభర తీస్తున్న వశిష్టకు ఈ సమస్య ఎదురవుతోంది. ముందు అనుష్కను అనుకున్నారు. కానీ బల్క్ డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో ఇప్పుడామె స్థానంలో త్రిష వచ్చేసిందని ఫిలిం నగర్ టాక్. మన్సూర్ అలీ ఖాన్ వివాదంలో త్రిషకు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం ఈ కారణంగానేనని చర్చలోకి రావడం తెలిసిన విషయమే. మృణాల్ ఠాకూర్ కూడా అంగీకారం తెలిపిందని ప్రాధమిక సమాచారం.
ఇంకో ముగ్గురు కథానాయికలు అవసరమట. కథ ప్రకారం అయిదు లోకాలను కలుపుతూ హీరో చేసే సాహస యాత్ర నేపథ్యంలో వశిష్ట పెద్ద కాన్వాస్ ని రాసుకున్నాడట. సబ్జెక్టు చాలా బాగా రావడంతో విన్న వాళ్ళు నో అనలేంత గొప్పగా ఉండటంతో పైన చెప్పిన ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. బ్యాలన్స్ పాత్రలకోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. మెహ్రీన్, తమన్నా,రాశి ఖన్నా, పూజా హెగ్డే, రీతూ వర్మ ఇలా వీలైనన్ని ఆప్షన్లు పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. శృతి హాసన్ రిపీట్ చేయకపోవచ్చు. ఆచార్య ఇష్యూ దృష్ట్యా కాజల్ అగర్వాల్ భాగం కాకపోవచ్చు.
సో ఫైనల్ గా ఎవరు లాక్ అవుతారనేది తేలడానికి కొంత టైం పడుతుంది. ప్రస్తుతం చిరంజీవి లేకుండా ఒక షెడ్యూల్ పూర్తి చేసిన వశిష్టతో ఈ వారం పది రోజుల్లోనే హీరో జాయినవుతారు. ఎంఎం కీరవాణి రెండు పాటల కంపోజింగ్ చేశారు. టైటిల్ ట్రాక్ చాలా బాగా వచ్చిందని, బాహుబలి వైబ్స్ అనిపించేలా మరోసారి మేజిక్ చేశారని రికార్డింగ్ స్టూడియో నుంచి వచ్చిన లీక్. భోళా శంకర్ డిజాస్టర్ దెబ్బకు ముందు సెట్స్ పైకి వెళ్లాల్సిన కల్యాణ కృష్ణ సినిమాని ఆపేసి మరీ విశ్వంభరని ముందుకు తీసుకొచ్చిన చిరంజీవిని 2025 సంక్రాంతి బరిలో చూసే అవకాశం ఉంది. ఇది ఇతర సమీకరణల మీద ఆధారపడి ఉంటుంది.