స్నేహితుడి కోసం ‘సలార్’ విధ్వంసం

ప్రభాస్ ఫ్యాన్సే కాదు సగటు మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సలార్ ట్రైలర్ వచ్చేసింది. షూటింగ్ లో ఉన్నన్నాళ్ళు కేవలం లీకైన పిక్స్ తో సంతృప్తి చెందిన అభిమానులు టీజర్ లో తమ హీరో ముఖం చూపించకుండా డైనోసర్ అంటూ పని కానివ్వడంతో అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. హోంబాలే ఫిలిమ్స్ ముందే ప్రకటించినట్టు సరిగ్గా 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ చేశారు. డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేని నేపథ్యంలో హైప్ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. పైగా కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ తోడవ్వడంతో అంచనాలు మాములుగా లేవు. మూడు నిమిషాలకు పైగా వీడియోలో క్లూస్ ఇచ్చారు.

ఈ కథ వెయ్యేళ్ళ క్రితమే మొదలవుతుంది. మొహమ్మద్ గజిని కాలం నుంచి ఆధిపత్య పోరులో తెగలు యుద్ధాలు చేసుకున్న తర్వాత ఖన్సార్ అనే పెద్ద నగరం ఉద్భవిస్తుంది. దానికి వారసుడిగా వరదరాజ మన్నార్(పృథ్విరాజ్ సుకుమారన్)కి పట్టం కట్టాలని చూస్తుంటాడు తండ్రి రాజ మన్నార్(జగపతిబాబు). అయితే శత్రువుల కుట్ర వల్ల చేజారిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రాణ స్నేహితుడు దేవా(ప్రభాస్)ని పిలుస్తాడు వరదరాజ. అక్కడి నుంచి అసలు ఊచకోత మొదలవుతుంది. అతను సృష్టించే విధ్వంసానికి పునాదులు కదులుతాయి. అదే సీజ్ ఫైర్.

ఊహాతీత యాక్షన్ ప్రపంచంలోకి దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి తీసుకెళ్లాడు. డార్క్ టోన్ మనకు కెజిఎఫ్ లోనే పరిచయం చేసినా ఇందులో చూపించిన విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రభాస్ లో కసిని కోపాన్ని పూర్తిగా ఆవిష్కరించిన విధానం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. రవి బస్రూర్ నేపధ్య సంగీతం ఎలివేషన్లని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.ప్రభాస్ చెప్పిన డైలాగులు విజిల్స్ వేయించే స్టఫ్ ఇస్తున్నాయి. మొత్తానికి సలార్ నుంచి ఏం కోరుకుంటున్నామో దాన్ని ఇచ్చేలా చేయడం నీల్ సక్సెస్ అయ్యాడు. ఇంతే స్థాయిలో మొత్తం సినిమా ఉంటే రికార్డుల అడ్రెస్ గల్లంతే.