దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం బయట సామెత. గ్యాప్ దొరికినప్పుడే ఎక్కువ సినిమాలు చేయడం ఇండస్ట్రీ నానుడి. దాన్ని అందరూ ఫాలో కాలేరు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఈ సూత్రం పాటించేవారు కానీ ఇప్పుడంతా నిదానమే ప్రధానం బ్యాచే. బడ్జెట్ లెక్కలు, హీరోల కండీషన్లు, పారితోషికాలు ఇలా సవాలక్ష కారణాలుంటాయి. ఇద్దరు మాత్రం దీనికి మినహాయింపుగా తెరవెనుక పరుగులు పెడుతూ ఫిల్మోగ్రఫీ పెంచుకుంటున్నారు. ఒకరు గౌతమ్ తిన్ననూరి. విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఫ్యామిలీ స్టార్ వల్ల రెగ్యులర్ షూటింగ్ పెండింగ్ పడింది.
తిరిగి ఫిబ్రవరిలో కాని మొదలుపెట్టలేని పరిస్థితి. ఇంకా చాలా టైం ఉండటంతో తక్కువ బడ్జెట్ లో గౌతమ్ కొత్తవాళ్ళతో ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తీశారని ఇన్ సైడ్ టాక్. పాటలకు చాలా ప్రాధాన్యం ఉండటంతో అనిరుద్ రవిచందర్ తో కంపోజ్ చేయించారట. చెన్నైలోనే దీనికి సంబంధించిన రికార్డింగ్ జరిగినట్టు సమాచారం. రెండో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ ఎప్పుడో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించి మధ్యలో నెలల సమయం దొరకడంతో గౌతమ్ లాగే రీజనబుల్ ఖర్చుతో ఓ మూవీని సౌండ్ లేకుండా సైలెంట్ గా పూర్తి చేశాడని వినికిడి.
ఈ రెండు ప్రోజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు కానీ చేతిలో పెద్ద సినిమాలున్నాయని నింపాదిగా ఉండకుండా ఇలా చేయడం మంచిదే. వీలైనంత ఎక్కువ బిజీగా హీరోలు, దర్శకులు ఉన్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అలా కాకుండా ఏళ్ళు గడిచిపోయినా పర్వాలేదు నెమ్మదిగా తీద్దాం అనుకుంటేనే సమస్య. గౌతమ్, ప్రశాంత్ వర్మ ఇద్దరూ వీటి గురించి ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ సరైన సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారట. జెర్సీ హిందీ రీమేక్ నిరాశపరిచాక గౌతమ్, జొంబి రెడ్డితో హిట్ అందుకున్నాక ప్రశాంత్ వర్మలకు భారీ బ్లాక్ బస్టర్ అవసరమే.