టాక్ బాగున్నా అద్భుతాలు జరగలేదు

గత నెల రోజుల్లో పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో వసూళ్లుగా మార్చుకోలేకపోయిన సినిమాలు రెండున్నాయి. ఒకటి మంగళవారం. రెండు కోట బొమ్మాళి పిఎస్. వీటిని తొలి రోజు చూసినవాళ్లు బాగుందన్నారు. రివ్యూలు పాజిటివ్ గా కనిపించాయి. కానీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయలేకపోయాయి. మంగళవారం విషయంలో టీమ్ ప్రమోషన్ల పట్ల తీసుకున్న శ్రద్ధ, ట్రైలర్ తో హైప్ తెచ్చిన విధానం ఆడియన్స్ లో మంచి ఆసక్తిని సృష్టించాయి. కానీ రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే నెమ్మదించడం ఊహించనిది. మెయిన్ ట్విస్టు ప్రియదర్శిని ముందే రివీల్ చేసినా లాభం లేకపోయింది.

ఇక్కడ మంగళవారం టీమ్ ను వెక్కిరించిన దురదృష్టం ఒకటుంది. రిలీజైన మూడో రోజే వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఆడటంతో ఆ రోజు కోట్లాది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి థియేటర్లకు రాలేదు. ఆక్యుపెన్సీలు దారుణంగా దెబ్బ తిన్నాయి. మన టీమ్ ఓటమి తేలేలోగా రాత్రి ఎనిమిది దాటేయడంతో అప్పటికప్పుడు సినిమాలకు వెళ్లే మూడ్ జనంలో లేకపోయింది. లేదంటే అదనంగా కనీసం ఓ మూడు కోట్ల గ్రాస్ ఒక్క సండేనే వచ్చి ఉండేదని బయ్యర్లు అభిప్రాయపడ్డారు. పికప్ అవుతుందేమో అనుకునే టైంలో ఇంకో ఫ్రైడే కొత్త రిలీజులు మూకుమ్మడిగా వచ్చేశాయి.

మంగళవారం చాలా నయం కానీ కోట బొమ్మాళి పీఎస్ మాత్రం నాలుగో రోజే చేతులెత్తేసే పరిస్థితి. ఎవరూ బాగాలేదని చెప్పలేదు. చూడొచ్చనే రికమండ్ చేశారు. టాక్ మెల్లగా పాకుతున్న టైంలో యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. ఒకవేళ పైన చెప్పిన ప్రతికూల పరిస్థితులు లేకుండా సోలోగా వచ్చి ఉంటే మంగళవారం భారీ ఎత్తున లాభ పడేదన్న కామెంట్లో నిజం లేకపోలేదు. క్యాస్టింగ్ వీకవ్వడం కోటబొమ్మాళికి మాస్ రాకుండా చేసింది. సో టాక్ బాగున్నంత మాత్రం ప్రతిసారి అద్భుతాలు జరగవనే వాస్తవం ఋజువయ్యిందిగా.