ఉప్పెన జంటకు ఇదేం శాపమో

మాములుగా ఒక బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చినప్పుడు కెరీర్ దాదాపు కుదురుకున్నట్టే. మంచి కథలు, దర్శకులు, కాంబినేషన్లు దొరికితే సెటిలైపోవచ్చు. కానీ ఉప్పెనతో పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను మాత్రం ఒకరకమైన శాపం వెంటాడుతోంది. పట్టుమని మూడేళ్లు తిరక్కుండానే కెరీర్ తిరోగమనంలో పడుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా, ముందు వెనుకా బోలెడు హీరోలు సపోర్ట్ గా నిలుస్తున్నా అవేవి వైష్ణవ్ కు ప్లస్ కావడం లేదు. పైగా ఎంపికలో చేస్తున్న పొరపాట్లు తన స్థాయికి మించిన పాత్రలను తెచ్చి అవసరం లేని విమర్శలకు తావిస్తున్నాయి.

కొండపొలం డిజాస్టరే అయినా ప్రయత్నలోపం లేని సినిమాగా చెప్పుకోవచ్చు. కానీ రంగ రంగ వైభవంగా, ఆదికేశవ రెండూ స్వయంకృతాపరాధాలే. స్క్రిప్ట్ చదివినా చాలు పరమ రొటీన్ అనిపించుకునే సబ్జెక్టులవి. అయినా సరే చేశాడు. ఏమైంది. వారం తిరక్కుండానే వెనక్కు వచ్చే రేంజ్ లో ఫ్లాప్ అయ్యాయి. నెక్స్ట్ ఎవరితో చేసినా కనీస బజ్ సంపాదించుకోవడం గగనమే. ఇక కృతి శెట్టికి ప్రారంభంలో ఇప్పుడు చూస్తున శ్రీలీల రేంజ్ లో స్టార్ డం వచ్చింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు లాంటి ఒకటి రెండు హిట్లు పడినా ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి.

ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఆయా హీరోలు గంటల్లోనే మర్చిపోయేంత దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రామ్, నితిన్, నాగ చైతన్య, సుధీర్ బాబు ఇలా అందరూ మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లతో చేసినా లాభం లేకపోయింది. లేకలేక సూర్య సరసన బాలా దర్శకత్వంలో ఓ సినిమా వస్తే అదేమో క్యాన్సిలైపోయి హీరో మారిపోయాడు. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో శర్వానంద్ మూవీ ఒకటే ఉంది. అది కూడా ఆగుతూ సాగుతూ వెళ్తోంది. ఇదేమైనా బ్రేక్ ఇస్తే తప్ప కృతి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టమే. అటు బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ 16 కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.