ఫ్యామిలీ స్టార్ కోసం శ్రీవల్లి క్యామియో

సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ఇష్టం లేకపోయినా విధి లేని పరిస్థితుల్లో కొత్త డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అయితే ఆగలేదు. ఫారిన్ షెడ్యూల్ కి బ్రేకన్న మాటే కానీ ముంబైలోనే పాట చిత్రీకరణ వేగంగా చేస్తున్నారు. కథ ప్రకారం విదేశాల లొకేషన్ డిమాండ్ లేకపోతే దర్శకుడు పరశురామ్ ఇక్కడే కానిచ్చేవాడు. నిర్మాత దిల్ రాజు ఈసారి పట్టువదిలి పండగ సీజన్ ని డ్రాప్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి రౌడీ హీరో బొమ్మ ఇంకా పందెంలో ఉన్నట్టే. ఇంకా టైం ఉంది కనక ఇందులో ప్రత్యేక ఆకర్షణలు జోడిస్తున్నారు.

తాజా అప్డేట్ ప్రకారం ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన్న క్యామియో ఉందట. తనకు టాలీవుడ్ లో అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. గీత గోవిందంతో జరిగిన మేజిక్ వల్లే శ్రీవల్లి పుష్ప నుంచి అనిమల్ దాకా వచ్చింది. పైగా విజయ్ దేవరకొండ హీరో అంటే రష్మిక కాదనే ఛాన్స్ ఉండదు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి కానీ ఆ బంధం గురించి ఇద్దరూ బయట పడటం లేదు. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఏదైనా కుండ బద్దలవుతుందేమోనని చూస్తే చెప్పీ చెప్పకుండా ఫోన్ కాల్ లో విజయ్ రష్మిక ఇద్దరూ విషయాన్ని దాటేశారు.

ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే ఫ్యామిలీ స్టార్ కో స్పెషల్ అట్రాక్షన్ తోడైనట్టే. ఇంకేం ఇంకేం కావాలే అంటూ విజయ్, రష్మికలు చేసిన మాయాజాలం ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోలేరు. కాసేపే అయినా మళ్ళీ కనిపిస్తే అభిమానులకు విందే. మార్చి విడుదల వైపు చూస్తున్న ఫ్యామిలీ స్టార్ జనవరి నెలాఖరు కూడా ఆప్షన్ గా పెట్టుకుంది. అయితే రిపబ్లిక్ డే రోజు హృతిక్ రోషన్ ఫైటర్, విక్రమ్ తంగలాన్ ఉండటంతో దీనికి సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ లో కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ రెండూ ఉంటాయట.