బహద్దూర్ కి యానిమల్ బుకింగ్స్ ఆందోళన

విడుదలకు ఇంకో అయిదు రోజులు ఉండగానే అనిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ మెట్రో స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం పివిఆర్ ఐనాక్స్, సినీపోలీస్ నుంచే ఇరవై నాలుగు గంటల్లో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. వీటిలో మిరాజ్, మూవీ మ్యాక్స్, ప్రసాద్స్ లాంటివి కలపలేదు. మొదటి రోజే చూసి తీరాలన్న బలమైన కోరికతో మూవీ లవర్స్ ఆలస్యం చేయడం లేదు. నవంబర్ 30 రాత్రి స్పెషల్ ప్రీమియర్లు ఉంటాయనే అనుమానమున్న ఫ్యాన్స్ ఇంకా వేచి చూస్తున్నారు కానీ ఆ సంగతి తేలాక అమ్మకాలు మరింత ఊపందుకుంటాయి. ఇదంతా బహదూర్ ని టెన్షన్ పెడుతోంది.

అదే రోజు విడుదలవుతోన్న విక్కీ కౌశల్ సామ్ బహద్దూర్ కి ఇప్పుడీ అనిమల్ వల్ల హైప్ సమస్య వచ్చింది. ఒక భారత వీర సైనికుడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. ప్రస్తుతానికి రెండు వేల దగ్గరలో ఉండగా అనూహ్యమైన మార్పు ఏమీ ఉండకపోవచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. అనిమల్ కు వచ్చే టాక్, దానికి టికెట్లు దొరక్క మిగిలే ఓవర్ ఫ్లోస్ మీదే సామ్ బహద్దూర్ ఓపెనింగ్ ఫిగర్స్ ఆధారపడి ఉంటాయని తేల్చి చెబుతున్నారు. మంచి కంటెంట్ అయినప్పటికీ విక్కీ కౌశల్ ఇమేజ్ ఆడియన్స్ ని ఫుల్ చేయలేకపోతోంది.

మొదటి ఆటకు అనిమల్ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సామ్ బహద్దూర్ కు కష్టాలు తప్పవు. ఎందుకంటే నార్త్ లో ఒక్కసారి బాగుందనే మాట వినిపిస్తే ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో అర్ధరాత్రి నుంచే స్పెషల్ షోలు వేస్తారు. ఈ ట్రెండ్ ఆది, సోమవారాలు దాకా కొనసాగుతుంది. ఆ వేవ్ ని సామ్ బహదూర్ తట్టుకోవడం కష్టం. నిజానికి అనిమల్ కి ఇంత మేనియాని ఎవరూ ఊహించలేదు. ప్రీ రిలీజ్ బజ్ ఉంటుందనుకున్నారు కానీ కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగా ఈ స్థాయిలో అంచనాలు పెంచేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు సిద్దపడటం తప్ప బహదూర్ చేతిలో ఏమి లేదు.