హృతిక్‌పై కంగనా సంచలన ఆరోపణలు

Kangana Hrithik

హృతిక్ రోషన్ పేరెత్తితే చాలు మంటెత్తి పోతుంది కంగనా రనౌత్. ‘క్రిష్-3’ చేస్తున్న సమయంలో అతడితో కొంత కాలం ఆమె డేటింగ్ చేసినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ దీని గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ.. కంగనా మాత్రం పలుమార్లు తాను, హృతిక్ సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పింది.

హృతిక్ గురించి ఇంతకుముందే పలు ఆరోపణలు చేసిన కంగనా.. తాజాగా అతడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లుగా పరోక్షంగా ఆరోపణలు చేసింది. అలాగే తాను కూడా ఓ సందర్భంలో డ్రగ్స్ రుచి చూసినట్లు ఆమె వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ తారల డ్రగ్స్ అలవాట్ల గురించి ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. చాలామందికి ఈ దురలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ దీని గురించి మాట్లాడింది.

ఓ నేష‌న‌ల్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కంగనా మాట్లాడుతూ ఓ స్టార్ హీరోకు డ్ర‌గ్స్‌ అలవాటు బాగా ఉందని.. ఓసారి అత‌ను డ్ర‌గ్స్‌ను మోతాదు మించి తీసుకుని ఆసుప‌త్రి పాల‌య్యాడని ఆరోపించింది. అతను ఈ విషయంలో మరీ అదుపు తప్పిపోవడంతో అతడిని భార్య కూడా విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయిందని అంది. ఆ స‌మ‌యంలోనే తాను అత‌నితో డేటింగ్ చేశానని.. ఆ స్టార్ హీరో కుటుంబ స‌భ్యులు తనను ఇబ్బంది పెట్టారని అంది.

కంగనా డేటింగ్ చేశానని చెప్పిందంటే ఆ వ్యక్తి హృతిక్ రోషనే అని భావిస్తున్నారు. ఐతే ఎన్నోసార్లు హృతిక్ మీద కంగనా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యల్ని కూడా జనాలు అంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఇండస్ట్రీలో తనకు గురువు అని చెప్పుకునే వ్యక్తి తనకు డ్రగ్స్ రుచించి చూపించినట్లు కంగనా తెలిపింది. ఆ వ్యక్తి ఆదిత్య పంచోలిగా అనుమానిస్తున్నారు. ఇండ‌స్ట్రీలో 99 శాతం మంది డ్ర‌గ్స్‌ను ఉప‌యోగిస్తుంటారని.. డ్ర‌గ్స్ సరఫరా చేసేవారిని విచారిస్తే చాలా మంది స్టార్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది కంగనా.