గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. యాక్షన్ కథలను, లవ్ స్టోరీలను అద్భుతంగా ప్రెజెంట్ చేయగల నైపుణ్యం ఆయన సొంతం. చెలి, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ప్రేమకథలను ఎంత హృద్యంగా తీశాడో.. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ కథలను అంత పకడ్బందీగా తీసి తన ప్రత్యేకతను చాటాడు గౌతమ్. ఐతే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యాక్సన్ మూవీ ‘ధృవ నక్షత్రం’ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. గౌతమ్‌కు చెందిన ఫాంటన్ ఫిలిమ్స్ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడమే అందుక్కారణం. దీని వల్ల ఆయన వేరే సినిమాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. ఐతే వాటిలో ఒక్కోదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ.. ‘ధృవనక్షత్రం’ సంగతే ఎటూ తేలకుండా పోయింది.
కొన్నేళ్ల పాటు అసలు వార్తల్లో లేని ఈ చిత్రాన్ని నవంబరు 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.గౌతమ్. దీంతో అన్ని అడ్డంకులనూ అతను అధిగమించాడనే అంతా అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన కథ వేరు. సమస్య పరిష్కరించుకుని రిలీజ్ డేట్ ఇవ్వలేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సమస్య పరిష్కరించాలని అనుకున్నాడు. దీని వల్ల మార్కెట్లో కొంత కదలిక వచ్చి డిజిటల్, శాటిలైట్ డీల్స్ పూర్తయితే.. ఆ డబ్బులతో ఈ సినిమాకు వ్యతిరేకంగా కేసులు వేసిన వాళ్లకు సెటిల్మెంట్ చేసి సినిమాను బయటికి తేవాలని గౌతమ్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కానీ అతడి ప్రణాళికలు ఫలించలేదు. సినిమా అనుకున్న ప్రకారం శుక్రవారం విడుదల కావట్లేదు.
ఐతే విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాను బయటికి తేవడానికి గౌతమ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడికి హీరో విక్రమ్ సహా ఎవ్వరూ సాయపడట్లేదు. ఈ సినిమా ఇలా అవ్వడానికి బాధ్యత తనదే కాబట్టి తనే ఏదో ఒకటి చేసి సినిమాను బయటికి తేవాలని చూస్తున్నట్లు గౌతమ్ చెప్పాడు కానీ.. అతడికి పరిస్థితులు సహకరించట్లేదు. ఇప్పుడు క్రేజున్న కొత్త సినిమాలకు కూడా డిజిటల్ రైట్స్ అమ్ముడు కాక ఇబ్బందులు తప్పట్లేదు. అలాంటిది ఐదారేళ్ల ముందు తీసి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సినిమాను కొనడానికి ఓటీటీలు ఏం ఆసక్తి చూపిస్థాయి? అందుకే సినిమాకు మోక్షం కలగక గౌతమ్ నిస్సహాయ స్థితిలో నిలబడ్డాడు. మరి ఈ స్థితిలో ‘ధృవనక్షత్రం’ ఎలా బయటికి వస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates