హీరోయిన్ త్రిష పట్ల ఒక ఇంటర్వ్యూలో తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఎంతటి దుమారానికి దారి తీశాయో చూస్తున్నాం. అతనున్న సినిమాలో ఎప్పటికీ నటించనని త్రిష శపథం చేయగా తనకు మద్దతుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు గళం విప్పారు. నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ సభ్యురాలు ఖుష్బూ ఈ వివాదం పట్ల తీవ్రంగా స్పందించి తన పదవి ఇచ్చిన బాధ్యతను వాడుకుంటూ అతని మీద ఖచ్చితంగా చర్యలు ఉండేలా అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పి ఒకరకమైన హెచ్చరిక కూడా జరీ చేశారు.
ఇంత జరిగినా సదరు వృద్ధనటుడికి ఏ కోశానా పశ్చాత్తాపం లేదని మూవీ లవర్స్ మండిపడుతున్నారు. అతను రిలీజ్ చేసిన వివరణ ప్రెస్ నోట్ లో తన కూతురు దిల్ రూపా త్రిషకు పెద్ద ఫ్యానని పేర్కొంటూ, పెళ్లి కావాల్సిన మరో ఇద్దరు అమ్మాయిలు తనకున్నారని, అలాంటప్పుడు ఎవరినో ఉద్దేశించి ఎందుకు నోరు జారతానని ఏదేదో చెప్పుకొచ్చాడు. 360 సినిమాల్లో నటించిన తనకు విలువల గురించి చెప్పాల్సిన అవసరం లేదని, అపార్థాలు సృష్టించి తనకు చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళు వేరే పని చూసుకోవాలని హితవు పలికాడు. ఎక్కడ క్షమాపణ ప్రస్తావన కించిత్ కూడా లేదు.
ఇలా చెప్పడం వల్ల మన్సూర్ తన ప్రవర్తనను సమర్ధించుకునే కొత్త డ్రామాకు తెరతీసినట్టు అయ్యింది. ఒకవేళ ఇలాగే వదిలేస్తే ఇలాంటి వాళ్ళు మరింత పెట్రేగిపోతారని పలువురు హీరోయిన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా ఈడొచ్చిన కూతుళ్లు ఇంట్లో పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకోవాలి తప్ప ఇంటర్వ్యూల ద్వారా వైరలవుతామనే భ్రమలో దశాబ్దాలుగా తెచ్చుకున్న పేరుని నాశనం చేసుకుంటున్న మన్సూర్ లాంటి వాళ్ళను చూస్తే భస్మాసుర కథే గుర్తుకు వస్తుంది. దీనికి క్షమాపణతో ఫుల్ స్టాప్ పెడతాడో లేక నేనింతేనని తెంపరితనం చూపిస్తాడో చూడాలి.