ది రైల్వే మెన్ ఎలా ఉందంటే

ఒక వెబ్ సిరీస్ చూడాలంటే ప్రేక్షకుల ప్రాధాన్యత ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కరోనా టైంలోలా వచ్చిన వాటన్నిటికి సమయం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 స్థాయిలో అంత గొప్ప కంటెంట్ ఏ ఓటిటిలోనూ రాలేదు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ది రైల్వే మెన్ మీద మాత్రం ఆడియన్స్ ప్రత్యేక ఆసక్తి కనపరిచారు. సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ కి ఇది డిజిటల్ డెబ్యూ. శివ్ రవైల్ దర్శకత్వం వహించగా నాలుగు ఎపిసోడ్లు, గంటకొకటి చొప్పున మొత్తం 240 నిమిషాల నిడివితో ది రైల్వే మెన్ వచ్చింది. ఇంతకీ టాక్ ఎలా ఉందో చూద్దాం.

కథ నలభై ఏళ్ళ క్రితం నాటిది. 1985 భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విషవాయువుల వల్ల పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్న ఇఫ్తేకర్ సిద్ధికి(కెకె మీనన్), సెంట్రల్ రైల్వె జనరల్ మేనేజర్ రతిపాండే(మాధవన్)లు కలిసి భోపాల్ మీదుగా వెళ్లాల్సిన గోరఖ్ పూర్ – ముంబై రైలుని ఆపే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు, కళ్ళముందే అయినవాళ్లు చనిపోతుంటే బాధితులు పడ్డ నరకయాతన, నగరంతో పాటు ట్రైన్ లో ఏర్పడ్డ విషమ పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది తెరమీద చూడాలి.

రెగ్యులర్ గా మనం చూసే క్రైమ్, సైకో కిల్లింగ్, అర్బన్ లవ్ కు భిన్నంగా ఇప్పటి తరానికి అవగాహన లేని ఒక రియల్ డిజాస్టర్ ని ఇలా తీసుకురావడం మెచ్చుకోదగ్గదే. సిరీస్ కావడంతో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మేకింగ్, నటీనటుల పెర్ఫార్మన్స్ రైల్వే మెన్ ని క్వాలిటీ పరంగా పైస్థాయిలో నిలబెట్టాయి. అన్సారీని పోస్ట్ మార్టం చేసే సీన్ ఇబ్బంది పెట్టేలా ఉన్నా దాన్ని మినహాయిస్తే బోలెడు హత్తుకునే ఎపిసోడ్లున్నాయి. ముఖ్యంగా భోపాల్ దుర్ఘటనతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. చూశాక నిరాశ పరచని క్యాటగిరీలో పడుతుందని మాత్రం చెప్పొచ్చు. తెలుగు ఆడియో కూడా ఇచ్చారు.