పదేళ్లు వెనక్కి వెళ్తే.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు శ్రీను వైట్ల. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్‌ల తర్వాత ఆయనకే ఎక్కువ డిమాండ్ ఉండేది. ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్లతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు వైట్ల. ఐతే ‘ఆగడు’ నుంచి ఆయన కెరీర్ తిరగబడింది. వరుస డిజాస్టర్లతో చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయాడు. ఫెయిల్యూర్లు మొదలయ్యాక కూడా మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి ఓవర్ బడ్జెట్ సినిమాలు తీసి నిర్మాతల పాలిట విలన్ అయ్యాడు.
ఈ చిత్రాల మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయింది. దీంతో వైట్లతో సినిమా చేయడానికి నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. చివరికి ఫెయిల్యూర్లలో ఉన్న మంచు విష్ణు కూడా వైట్లతో సినిమా ఓకే చేసినట్లే చేసి వెనుకంజ వేసిన సంగతి తెలిసిందే. చివరికి గోపీచంద్ హీరోగా చిత్రాలయం మూవీస్ అనే కొత్త బేనర్ వైట్లతో కొన్ని నెలల ముందు ఓ సినిమాను మొదలుపెట్టింది.
ఈ సినిమా షూటింగ్ యూరప్‌లోని మిలాన్‌లో మొదలైన విషయాన్ని శ్రీను వైట్లనే ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఐతే తాజాగా ఈ ప్రాజెక్టుకు కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బేనర్లో భాగస్వాములుగా ఉన్న నిర్మాతల్లో భేదాభిప్రాయాలు వచ్చి ఒకరు తప్పుకొన్నారని.. దీంతో వేరే బ్యాకప్‌తో ఒక్కరే సినిమాను భుజాల మీదికి ఎత్తుకున్నారని సమాచారం.
దీని వల్ల బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. ఇటు శ్రీను వైట్ల, అటు గోపీచంద్ ఇద్దరి మార్కెట్ దెబ్బ తినగా.. ఈ సినిమాకు బడ్జెట్ కొంచెం ఎక్కువే అయ్యేట్లుండటంతో రిస్క్ అని భావించి ఓ భాగస్వామి తప్పుకున్నట్లుగా టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఐతే ప్రస్తుతానికి సర్దుబాటు జరిగినప్పటికీ.. వైట్ల బడ్జెట్ హద్దులు పాటించి జాగ్రత్తగా సినిమా తీయకపోతే మాత్రం మున్ముందు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.