గుంటూరు కారం బిజినెస్ ఇంత క్రేజీగానా

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం ఫస్ట్ ఆడియో సింగల్ వచ్చాక అంచనాలు ఇంకాస్త ఎగబాకాయి. దానికి తగ్గట్టే బిజినెస్ ఆఫర్లు భారీగా వస్తున్నాయని ఇన్ సైడ్ టాక్. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కుల నుంచి సుమారు 115 కోట్ల దాకా డీల్ కావొచ్చనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం తెలుగులో మాత్రమే రిలీజయ్యే ఒక కమర్షియల్ మూవీకి ఇంత ధర పలకడం అనూహ్యం. పైగా ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ లేవు. ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఒకేసారి డబ్బింగ్ వెర్షన్లు ప్లాన్ చేయలేదు.

అసలా ఆలోచన కూడా లేదు. అలాంటప్పుడు ఇంత క్రేజ్ రావడానికి కారణం కేవలం కాంబో మీదున్న క్రేజే. నిజానికి సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొనడంతో బయ్యర్లు సినిమాలు కొనే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బరిలో వెంకటేష్, విజయ్ దేవరకొండ, రవితేజలతో పాటు హనుమాన్ లాంటి గ్రాండియర్లు ఉండటంతో ఓపెనింగ్స్ పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. అయితే మహేష్ బాబుకి మాత్రం ఈ టెన్షన్లు మినహాయింపని చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఫ్యామిలీస్, మాస్ ఇద్దరికీ గుంటూరు కారమే ఫస్ట్ ఛాయస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తమన్ సంగీతం, శ్రీలీల గ్లామర్, భారీ తారాగణం, వీటితో పాటు బలమైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ స్టైల్ లో త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయట. పైన చెప్పిన ఫిగర్ నిజమయ్యే పక్షంలో అంత మొత్తం రికవరీ అవ్వాలంటే రెండు వందల కోట్ల గ్రాస్ దాటేయాలి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ స్థాయిలో టాక్ వస్తేనే సాధ్యమవుతుందనేది ఒక అంచనా. సరిలేరు నీకెవ్వరు లాంటి టెంప్లేట్ మసాలా మూవీతోనే రికార్డులు బద్దలు కొట్టిన మహేష్ కు అల వైకుంఠపురములో తర్వాత అంతకు మించి కసితో ఉన్న త్రివిక్రమ్ జట్టు కడితే సంచలనాలకు కొదవ ఉంటుందా.