చిన్న కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి, తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంబ్యాక్ ఇచ్చి, ఇప్పుడు నటుడిగా నాలుగో ఇన్నింగ్స్ ఆడుతున్న సునీల్ కి భలే ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా ఇతర భాషల్లో కావడం గమనించాల్సిన విషయం. తమిళంలో మహావీరుడుతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సునిల్ కు రజనీకాంత్ జైలర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. లెన్త్ తక్కువగా ఉన్నా ఇంపాక్ట్ ఎక్కువగా వచ్చింది. మార్క్ ఆంటోనీలో విశాల్, ఎస్జె సూర్యల డ్యూయల్ రోల్స్ మధ్య తన ఉనికిని చాటుకోవడం విశేషమే. కార్తి జపాన్ సినిమానే తేడా కొట్టింది కానీ సరైన రీతిలో తీసుంటే ఇంకో బ్రేక్ దక్కింది.
తాజాగా సునీల్ రొట్టె విరిగి కేరళ నేతిలో పడింది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం టర్బోలో ఛాన్స్ కొట్టేశాడు. మాములుగా మల్లువుడ్ లో తెలుగు ఆర్టిస్టులకు ఆఫర్లు రావడం చాలా అరుదు. చూసిన దాఖలాలు తక్కువే. అలాంటిది ఇంత పెద్ద అవకాశం వెతుక్కుంటూ రావడం మాటలు కాదు. ఇది పుష్ప ప్రభావమేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా కూల్ గా చేసిన విలనిజం ఇంత బ్రేక్ ఇస్తుందని బహుశా ఆ క్యారెక్టర్ ని సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఊహించి ఉండడు. ఇలా బిజీ అయిపోతున్న కారణంగానే సునీల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఒప్పుకోవడం మానేశాడట.
ఒకవేళ కేరళలోనూ హిట్టు కొడితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. మూడేళ్ళ క్రితం వేషాలు తగ్గిపోయి త్రివిక్రమ్ సినిమాల్లో చిన్న పాత్రలకు సైతం ఎస్ చెప్పిన సునిల్ కి ఇప్పుడు దక్కుతున్నదంత స్పెషల్ బోనసే. తన స్కిన్ టోన్, బాడీ లాంగ్వేజ్ తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం ఇన్నేళ్ల తర్వాత కోలీవుడ్ దర్శకులు గుర్తించారు. అందుకే ఎన్నడూ లేనంత బిజీగా హైదరాబాద్ టు చెన్నై ట్రిప్పులు కొడుతున్నాడు. చిరంజీవి, రజనీకాంత్ ఇప్పుడు మమ్ముట్టి మొత్తం మూడు బాషల అగ్ర స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అరుదైన ఘనతకు సునిల్ దక్కించుకున్నాడు. ఇంకో ఐదారేళ్ళ ఢోకా లేనట్టే.