హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో మొన్నటి తరం నుంచి ఇప్పటి జనరేషన్ దాకా అందరి హీరోల సినిమాల్లో నటించిన అరుదైన ఖ్యాతిని సంపాదించుకున్న విలక్షణ నటులు చంద్రమోహన్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ అపోలోలో హృద్రోగానికి చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. కృష్ణాజిల్లా పమిడిముక్కాల స్వస్థలం. 1943 మే 23 జన్మించారు. 1966 రంగుల రాట్నంతో తెరంగేట్రం చేశారు. మొదటి సినిమనే గొప్ప పేరు తీసుకురావడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కెరీర్ తొలినాళ్ళలోనే బివి రెడ్డి, కె విశ్వనాథ్, డి మధుసూదనరావు, ఎస్వి రంగారావు లాంటి అభిరుచి కలిగిన దర్శకులతో పనిచేసే అదృష్టం దక్కడంతో చంద్రమోహన్ కు చిరస్మరణీయ విజయాలు దక్కాయి. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబుతో ఘాడమైన స్నేహం కలిగిన ఈ అభినయ శిఖరం వాళ్ళతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్నారు. 80 దశకంలో హాస్య నటుడిగా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ఎన్నో ఆణిముత్యాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. కలికాలం, శంకరాభరణం, కొత్త నీరు, సిరిసిరిమువ్వ, ప్రేమించుకుందాం రా తదితరాలు చంద్రమోహన్ నటించిన మరపురాని చిత్రాల్లో కొన్ని.
తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందటం చంద్రమోహన్ కు దక్కిన అరుదైన ఖ్యాతి. తర్వాత ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. చిరంజీవికి సహ హీరోగా ఆ తర్వాత అతనికే తండ్రిగానూ నటించి మెప్పించడం చంద్రమోహన్ కే చెల్లింది. 2017 గోపీచంద్ ఆక్సిజన్ తర్వాత అనారోగ్యం దృష్ట్యా బ్రేక్ తీసుకున్నప్పటికీ తరచు ఇంటర్వ్యూలు ఇస్తూ పాత కబుర్లు పంచుకున్న చంద్రమోహన్ ఇలా కన్ను మూయడం యావత్ పరిశ్రమకే కాదు ప్రేక్షక లోకానికీ తీరని లోటు. నటించే నిఘంటువుగా ఇప్పటి తరం వాళ్ళు ఆయన వృత్తి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.