రాజమౌళి నుంచి ప్రభాస్ ఏం నేర్చుకున్నట్లు?

రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదు.. తిరుగులేని మార్కెటింగ్ నిపుణుడు అనడంలో సందేహం లేదు. ఆయన సినిమాలు అంత పెద్ద సక్సెస్ అవడానికి, సినిమా సినిమాకూ రీచ్ పెరుగుతుండటానికి రాజమౌళి మార్కు మార్కెటింగ్ కూడా ఓ ముఖ్య కారణం. జక్కన్న ఎవరితో సినిమా చేసినా.. అనౌన్స్‌మెంట్ ‌నుంచే భారీ హైప్ వస్తుంది. సినిమాకు అది సరిపోతుందని జక్కన్న ఎప్పుడూ అనుకోడు. అనౌన్స్‌మెంట్ నుంచే ప్రమోషన్ మొదలుపెడతాడు. సమయానుకూలంగా అప్‌డేట్స్ ఇస్తాడు. ఒక పోస్టర్ రిలీజ్ చేసినా.. పాట లాంచ్ చేసినా.. ఇంకే ప్రోమో వదిలినా.. అది జనాల్లోకి వెళ్లి కొన్ని రోజుల పాటు తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తాడు.

సినిమా రీచ్‌ను ఇంకా ఇంకా పెంచడానికి చూస్తాడు. జక్కన్న సినిమాలకు అంతకంతకూ హైప్ పెరగడమే తప్ప.. తగ్గడం ఉండదు. ఐతే ‘బాహుబలి’ సినిమాకు పనిచేస్తూ జక్కన్నను దగ్గరగా చూసిన ప్రభాస్.. ఆయన్నుంచి ఏం నేర్చుకున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలకు మంచి హైప్ వస్తోంది. కానీ ఆయా సినిమాలను ప్రమోట్ చేసి రీచ్ పెంచడంలో మాత్రం ఆయా చిత్రాల బృందాలు విఫలమవుతున్నాయి.

‘సాహో’ వరకు ఓకే అనిపించినా.. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రమోషన్ల విషయంలో వెనుకబడ్డాయి. సరైన ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వలేదు. రిలీజ్ ప్లానింగ్ దెబ్బ తింది. వాటి సంగతెలా ఉన్నా ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ జట్టు కట్టడం వల్ల ‘సలార్’కు మొదట్నుంచి భారీ హైపే ఉంది. కానీ ఈ సినిమా ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రిలీజ్ ప్లానింగ్ విషయంలో ఎంత ఘోరంగా దెబ్బ తిన్నారో తెలిసిందే.

సినిమా ఆలస్యం అయితే అయింది. కానీ ఇటు ప్రేక్షకులకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు సరైన కమ్యూనికేషన్ కూడా ఇవ్వలేదు. కొత్త డేట్ ఇచ్చాక ఇప్పటిదాకా ఏ రకమైన ప్రమోషనల్ కంటెంట్ కూడా వదల్లేదు. ప్రభాస్ పుట్టిన రోజుకి చిన్న టీజర్ వదల్లేదు. పాటల ఊసు కూడా లేదు. అప్పుడప్పుడూ మసక మసక పోస్టర్లు వదలడం తప్ప ప్రమోషన్ల పరంగా ఘోరంగా ఉంది వ్యవహారం. ‘సలార్’ టీం తీరు చూస్తుంటే కనీసం డిసెంబరు 22న అయినా పక్కాగా సినిమా రిలీజవుతుందా అన్న డౌట్లు కూడా కొడుతున్నాయి.

టీం అలా ఉంటే ప్రభాస్ ఏం చేస్తాడు అని కొట్టిపారేయడానికి కూడా లేదు. ‘బాహుబలి’కి ముందు నుంచి ఎంత హైప్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల అభిమానాన్ని గ్రాంటెడ్‌గా తీసుకోకుండా, ఒక లిమిట్ ఏమీ పెట్టుకోకుండా జక్కన్న ఎలా ప్రమోట్ చేశాడో దగ్గర్నుంచి చూసిన ప్రభాస్.. ‘సలార్’ విషయంలో జాగ్రత్త పడాల్సిందే.  ఆల్రెడీ మూడు సినిమాలు మూడు భారీ నష్టాలు మిగిల్చాయి. ‘సలార్’ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టి కూర్చున్నారు బయ్యర్లు. ఈసారి తేడా కొడితే ప్రభాస్ కెరీర్‌కు బాగా డ్యామేజ్ జరుగుతుంది. అలాంటపుడు రిలీజ్ ప్లానింగ్, ప్రమోషన్లు పక్కాగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభాస్ మీద కూడా ఉంది. ఇకనైనా అతను కొంచెం జాగ్రత్త పడితే మంచిది.