మేం అన్ని సినిమాలను ఆదరిస్తామని తమిళ హీరోలు ఇక్కడికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పుకోవడమే కానీ వాస్తవానికి పరిస్థితి దానికి భిన్నంగా ఉందన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఆ స్టేట్ మెంట్ సమర్ధించుకోవడానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ పేర్లు వాడి ఏదో లాజిక్ మాట్లాడాం అనుకుంటారు కానీ అవి కాకుండా ఇతర బాష నుంచి వచ్చిన ఒక కమర్షియల్ మూవీ తమిళనాడులో ఆడిన దాఖలాలు చూపించమంటే మాత్రం దిక్కులు చూడాల్సిందే. ఇది పక్క రాష్ట్రంలో మనకు దక్కే రిసెప్షన్. కానీ అక్కడివి ఏవైనా డబ్బింగులు వస్తే మాత్రం మనోళ్లు ఛాన్స్ తక్కువగా ఉన్నా పోటీపడి మరీ థియేటర్ల అడ్జస్ట్ చేస్తారు.
సంక్రాంతికి వేడి చాలా తీవ్ర స్థాయిలో రాజుకోనుంది. తెలుగు నిర్మాతలు గొంతు పెంచకపోతే అన్యాయమైపోయేది మన సినిమాలే. రజనీకాంత్ లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ లు పొంగల్ కి పక్కాగా వస్తున్నాయి. ఇక్కడ చూస్తేనేమో గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ లకు స్క్రీన్లు సరిపోకపోతే ఏం చేయాలో అర్థం కాక బయ్యర్లు బుర్రలు బద్దలు కొంటున్నారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఎవరైనా పైన చెప్పిన మూడు ఆరవ బొమ్మలు హక్కులు కొనేసుకొచ్చి మాకూ థియేటర్లు ఇవ్వండని డిమాండ్ చేస్తే అప్పుడేం చేయాలి.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ సమస్య మీద ఒక అండర్ స్టాండింగ్ కు రావాల్సిందే. మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియాలో గుర్తింపు ఉన్న హీరోలే అయినా సంక్రాంతికి మనకూ థియేటర్లు పంచమంటే కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకుంటారా. ససేమిరా అంటారు. మనం మాత్రం అనువాద హక్కులు కొన్నారన్న జాలితో ఎంత కష్టమైనా సర్దుబాటుకు సహకరిస్తాం. ఈ ఏడాది చిరంజీవి, బాలయ్యలు ఉన్నా సరే విజయ్, అజిత్ కు తగినన్ని థియేటర్లు దక్కాయి. ఈసారి ఇంతకు ఐదింతల పెద్ద చిక్కు రాబోతోంది. ఇప్పుడైనా ఒక తాటిపైకి వస్తారా లేక ఎవరి వ్యాపారం వాళ్ళదని వదిలేస్తారా చూడాలి.