ఒక కథ అనుకుని దాంతో సినిమా మొదలుపెట్టాక ఫుటేజ్ ఎక్కువైంది అనిపిస్తే చాలు.. సెకండ్ పార్ట్ అంటున్నారు ఈ మధ్య ఫిలిం మేకర్స్. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడం.. రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టినప్పటి నుంచి ఈ ఒరవడి ఊపందుకుంది. ‘పుష్ప’ను కూడా ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత రెండు భాగాలు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు మూడో భాగం తీసే ఆలోచన కూడా ఉందట.
కానీ అదెంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. కాగా దక్షిణాదిన తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘ఇండియన్-2’ కూడా అంతటితో ఆగిపోదట. దానికి కూడా మూడో భాగం ఉంటుందట. ఈ విషయం ‘ఇండియన్-2’లో నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్ స్వయంగా వెల్లడించాడు. ‘ఇండియన్-3’ ఉంటుందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. కానీ దానిపై క్లారిటీ లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని.. దీని కథ విస్తృతి ఎక్కువ అని.. కాబట్టి ‘ఇండియన్-3’ కూడా వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు కమల్ హాసన్ కొత్తగా 40 రోజుల డేట్లు ఇచ్చాడని.. షూటింగ్ జరుగుతోందని.. శంకర్, కమల్ ఇద్దరూ కూడా ఔట్‌పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఈ సినిమాకు మూడో భాగం చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అతనన్నాడు.
ఇండియన్-2 వచ్చే ఏప్రిల్లో రిలీజవుతుందని ఉదయనిధి ధ్రువీకరించాడు. ఇండియన్-2కు ఒక చోట బ్రేక్ ఇచ్చి.. ఇందులో మిగిలిన కంటెంట్‌కు మరికొంత జోడించి ఇండియన్-3ని సెట్ చేయాలన్నది శంకర్ ఆలోచన అట. ఇండియన్-3ని కూడా వచ్చే ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని కూడా శంకర్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది.