కొత్త చిక్కు – సంక్రాంతికి ధనుష్ మిల్లర్

రాబోయే సంక్రాంతి తెలుగు రాష్ట్రాల బయ్యర్లకు ఒక నెల ముందే నిద్ర లేని రాత్రులు మిగిల్చేలా ఉంది. ఇప్పటికే లాక్ చేసుకున్న సినిమాలతో థియేటర్ల సర్దుబాటు ఎలా చేయాలో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే తాజాగా ధనుష్ కూడా పొంగల్ పండగే కావాలని నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. కెప్టెన్ మిల్లర్ ని ఎంత పోటీ ఉన్నా సరే ఫెస్టివల్ సీజనే లక్ష్యంగా దింపాలని ఫిక్స్ అయినట్టు చెన్నై టాక్. ముందు అఫీషియల్ గా ప్రకటించిన తేదీ డిసెంబర్ 15. కానీ సలార్, డుంకీలకు వారం ముందు అంటే పెద్ద రిస్క్ అవుతుంది కాబట్టి డ్రాప్ అయినట్టు తెలిసింది.

ఇక్కడా మంచి మార్కెట్ ఉన్న ధనుష్ నటించిన మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఇది. శివరాజ్ కుమార్, ఆర్య, ప్రియాంకా మోహన్ లాంటి క్రేజీ క్యాస్టింగ్, భారీ బడ్జెట్ తో రూపొందించారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వంద కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టారట. ముందు తమిళం ఆ తర్వాత ఇతర భాషలంటే కుదరదు. ఒకేసారి రిలీజ్ చేయాల్సిందే. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, ఫ్యామిలీ స్టార్, లాల్ సలామ్, అయలన్ తో ఆల్రెడీ పోటీ యమా వేడి మీద ఉంది. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ తోడైతే మొత్తం కౌంట్ 8 చేరుతుంది. ఇందులో బాలీవుడ్ రిలీజులు కలపలేదు. అవి అదనం.

అసలు ఏ ధైర్యంతో ఇంత రిస్కులు చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. ధనుష్, శివ కార్తికేయన్, రజనీకాంత్ లకు ప్రాధమికంగా వాళ్ళ స్వంత మార్కెట్ ముఖ్యం. అలా అని అనువాదాలను తేలికగా తీసుకోరు. మన నిర్మాతలూ హక్కులు కొనిమరీ ప్రోత్సహిస్తారు. అలాంటప్పుడు స్క్రీన్ల పంపకాల్లో తేడాలు వస్తే దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద తీవ్రంగా ఉంటుంది. ఒక బి సెంటర్ లో అయిదు థియేటర్లు ఉంటే మన తెలుగు సినిమాలకే ఒకటి తక్కువొస్తుంది. అప్పుడు షోల వంతున పంచాలి. అలాంటిది ఇంకో మూడు డబ్బింగులంటే ఎగ్జిబిటర్ల తల బొప్పి కట్టడం ఖాయం. ఇంకేమేం వినాల్సి వస్తుందో.