నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయన సినిమాలో భాగస్వామిగా మాత్రం మారుతున్నాడు.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. అంటే నేరుగా త్రివిక్రమ్ పేరు నిర్మాతగా పోస్టర్ మీద పడటం లేదు కానీ.. ఆయన భార్య సాయి సౌజన్య ఆధ్వర్యంలో మొదలైన ‘ఫార్చ్యూన్ ఫోర్’ సంస్థకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉండటం విశేషం. అంటే త్రివిక్రమ్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరన్నమాట.
తాను నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమా అంటే స్క్రిప్టు, మేకింగ్ విషయంలో ఎంతో కొంత త్రివిక్రమ్ టచ్ ఉండకపోదు. ఆ సంకేతాలు ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్లోనే కనిపించాయి. ఈ పోస్టర్ చూస్తే.. మాస్ టచ్ ఉంటూనే స్టైలిష్‌గా ఉండే సినిమాలా కనిపిస్తోంది ఎన్‌బీకే 109. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’ అంటూ ఈ పోస్టర్ మీద క్యాప్షన్ పెట్టారు.
గొడ్డలికి కళ్లజోడు తొడిగించి ఆ కళ్లజోడులో రౌడీలు ఎగురుతున్న దృశ్యం కనిపించేలా పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ఈ సెటప్ అంతా చూస్తే ఇదొక వయొలెంట్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది. పోస్టర్ మీద హీరో, డైరెక్టర్, నిర్మాతల పేర్లు తప్ప వేరే సాంకేతిక నిపుణుల వివరాలు లేవు. ఈ మధ్య బాలయ్యకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన తమనే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తాడని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం. బాలయ్య నెవర్ బిఫోర్ గెటప్‌లో కనిపించనున్నాడట ఈ చిత్రంలో.