ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓటిటిలో అడుగు పెట్టబోతున్నారని, పాతిక సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుని ఒక్కోదానికి అయిదు కోట్ల చొప్పున కేటాయించబోతున్నారనే వార్త ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే తిరిగింది. అయితే ఎస్విసి బృందం మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. ఇవన్నీ పుకార్లేనని, నమ్మొద్దంటూ పేర్కొంటోంది. దిల్ రాజు లైనప్ ని చూస్తే మళ్ళీ ఇంకో రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేంత టైం లేదు. అందుకే చిన్న చిత్రాలు నిర్మించే బాధ్యతను కుమార్తెకు అప్పజెప్పి విజయవంతంగా బలగంతో ఆమెను ప్రొడ్యూసర్ గా లాంచ్ చేశారు. ఇక ఓటిటి ప్రసక్తి ఎక్కడిది.
ఎంత అగ్ర నిర్మాతైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటిటి వ్యవహారాలు సులభం కాదు. అంత అనుభవమున్న అల్లు అరవింద్ గారే ఆహాని అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లతో పోటీ పడే రేంజ్ కు తీసుకెళ్లలేకపోయారు. కొత్త కంటెంట్ సృష్టించేందుకు అవుతున్న ఖర్చుకి, వ్యూస్ తో వచ్చే రాబడికి పొంతన లేకుండా ఫలితాలు కనిపిస్తుండటంతో వెబ్ సిరీస్ ల నిర్మాణం బాగా తగ్గించేశారు. దానికి బదులు సినిమాలు కొనడం మీద ఫోకస్ పెట్టారు. టాక్ షోలు, ఇంటర్వ్యూలు, రియాలిటీ కాంపిటీషన్లతో నెట్టుకొస్తున్నారు కానీ ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని డిజిటల్ టాక్.
కొన్నేళ్ల క్రితం సురేష్ బాబు సైతం ఈ ఆలోచన చేశారు. కానీ బిజినెస్ విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే ఆయన తర్వాత ఆ ప్రపోజల్ ని పక్కన పెట్టేశారు. సురేష్ ప్రొడక్షన్ పాత క్లాసిక్స్ ని రీ మాస్టర్ చేయించి యూట్యూబ్ లో పెట్టారు తప్పించి ప్రత్యేకంగా ఓటిటి పెట్టుకుని దాంట్లో చూడమని చెప్పలేదు. సో దిల్ రాజు మనసులో ఏమీ లేనట్టుగానే కనిపిస్తోంది. గేమ్ చేంజర్, ఫ్యామిలీ స్టార్, తమ్ముడు తదితర సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ పనుల్లో తలమునకలై ఉన్న ఈ టాప్ ప్రొడ్యూసర్ నిజంగా డిజిటల్ లో అడుగు పెడితే అదో సంచలనమే అవుతుంది.