ఉస్తాద్ విశ్రాంతి తీసుకోక తప్పదా

హిట్టు కొట్టినా సరే తన కొత్త సినిమాకు నాలుగేళ్ళకు పైగా టైం పడుతున్నా దర్శకుడు హరీష్ శంకర్ ఓపిగ్గా ఎదురు చూసింది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేశాకే వేరే ప్రాజెక్టుని వెళ్లాలని. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కు బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు ఒకరకమైన బ్రేక్ కి దారి తీస్తే, ఆయన బెయిలు మీద బయటికి వచ్చి జనసేన అధినేతతో రెండు గంటలకు పైగా మీటింగ్ పెట్టాక పరిస్థితులు కొత్త మలుపు తిరిగేలా ఉన్నాయి. ఓజి కు మాత్రమే డేట్స్ ఇచ్చి పూర్తి చేయించే ఆలోచనలో పవర్ స్టార్ ఉన్నట్టు మెగా కాంపౌండ్ టాక్.

ఇదే నిజమైతే హరీష్ శంకర్ కు కనీసం ఆరు నెలల గ్యాప్ వస్తుంది. ఇది తక్కువ సమయం కాదు. ఏపీ ఎన్నికలు ఇంకో నాలుగైదు నెలల్లో వచ్చేస్తాయి. జనసేన టిడిపి తరఫున పవన్, లోకేష్ లు సంయుక్తంగా ప్రచార యాత్రకు ప్లాన్ చేస్తారట. ఉమ్మడి మ్యానిఫెస్టో సిద్ధం కాగానే ప్రణాళిక తయారవుతుంది. అప్పుడు ఓజికి కాల్ షీట్లు ఇవ్వడం కూడా కష్టమే. అయితే సుజిత్ ఒక్క నెల అడిగాడని, ఒకవేళ కుదరని పక్షంలో కనీసం ఇరవై రోజులు ఇస్తే ఏదోలా తంటాలు పడి టాకీ పార్ట్ పూర్తి చేస్తానని చెప్పాడట. పాటలు వీలుపడకపోతే మాంటేజ్ సాంగ్స్ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి.

వచ్చే ఏడాది తొలి సగంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా లేదానే దాని మీద ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఓజిని సమ్మర్ కైనా విడుదల చేయాలనేది నిర్మాత డివివి దానయ్య ప్లాన్. కానీ దానికి పవన్ పూర్తిగా సహకరిస్తేనే జరుగుతుంది. దీనికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పేదేముంది. హరిహర వీరమల్లు గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎక్కడ కలిసినా నిర్మాత ఏఎం రత్నం నవ్వుతు అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఖచ్చితంగా చెప్పడం లేదు. నెక్స్ట్ వెయిటింగ్ లో ఉన్న సురేందర్ రెడ్డికి 2025కన్నా ముందు డైరెక్ట్ చేసే ఛాన్స్ దాదాపు లేనట్టే.