స్టార్ హీరోల సినిమాల్లో లాజిక్స్ వెతకకూడదు కానీ మరీ వాస్తవానికి దూరంగా ఉన్నా రిస్కే. జనాలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తారు. నిన్న కమల్ హాసన్ భారతీయుడు 2 ఇంట్రో సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విజువల్స్ గట్రా సంతృప్తిపరిచాయి కానీ అనిరుద్ రవిచందర్ ట్యూనే కాస్త రెగ్యులర్ ఫీల్ ఇచ్చిందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడ్డారు. మనోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కింగ్ కాబట్టి థియేటర్ ఎక్స్ పీరియన్స్ అయ్యాక దాని గురించి ఒక అంచనాకు రాగలం. ఇప్పుడో ముఖ్యమైన టాపిక్ కమల్ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ మధ్య చర్చకు దారి తీస్తోంది.
భారతీయుడు మొదటి భాగంలో 1947 దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి సేనాపతి (కమల్ పోషించిన పాత్ర పేరు) వయసు కనిష్టంగా పాతికేళ్ల పైనే చూపిస్తారు. అంటే కాస్త అటు ఇటుగా 1922 ప్రాంతంలో పుట్టాడన్న మాట. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యింది 1996లో. ఆ టైంకి వయసు 70 సంవత్సరాలు దాటేసింది. ఈ లెక్కన ఇప్పుడు 2023లో పెద్దాయన ఏజ్ సెంచరీ కొట్టేసింది. మరి అంత లేట్ వయసులో సేనాపతి ఇండియాకు వచ్చి లంచగొండుల భరతం పట్టి, పోలీసులకు దొరక్కుండా నేరాలు చేసేంత రేంజ్ లో నమ్మించేలా ఉంటాడానే అనుమానం అందరిలోనూ తలెత్తుతోంది.
ఇది తర్కానికి పూర్తి దూరంగా అనిపిస్తుంది. ఒకవేళ శంకర్ కనక భారతీయుడు 2 స్టోరీ ఏ 2000 సంవత్సరంలో జరిగిందని చూపిస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా టెక్నాలజీలో మునిగితేలుతున్న ఇప్పటి జనరేషన్ లో నడిపిస్తే మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏం శతాధిక వృద్ధులు ఉత్సాహంగా పని చేయరా అని అడగొచ్చు కానీ కొంతైనా నమ్మశక్యంగా ఉంటేనే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. లేదంటే లేనిపోని డైవర్షన్లు శంకరే ఇచ్చినట్టు అవుతుంది. వచ్చే ఏడాది వేసవి విడుదలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయుడు 2 మీద గేమ్ ఛేంజర్ డేట్ ఆధారపడి ఉంది.