10 సినిమాలున్నా సౌండ్ ఇద్దరిదే

దసరాకు ముగ్గురు పెద్ద హీరోలు సందడి చేశాక తర్వాతి వారం పూర్తిగా వృథా అయిపోయింది. కౌంట్ పరంగా బాగానే వచ్చాయి కానీ కంటెంట్ విషయంలో ఏ ఒక్కటీ మెప్పించలేక చేతులు ఎత్తేశాయి. అంతో ఇంతో మార్టిన్ లూథర్ కింగ్ పాసవుతుందనుకుంటే సంపూర్ణేష్ బాబు కనీస స్థాయిలో జనాన్ని రప్పించలేకపోయాడు. ఇక కొత్త ఫ్రైడే వచ్చేసింది. రేపు తొమ్మిదికి పైగా రిలీజులున్నాయి. వాటిలో కొన్ని పేర్లు కూడా ఆడియన్స్ కి తెలియనంత గుట్టుగా షూటింగ్ జరుపుకున్నవి. సంఖ్య ఎన్ని ఉన్నా ప్రమోషన్ల ద్వారా ఆడియన్స్ దృష్టిలో పడ్డవి రెండే. ఒకటి కీడా కోలా. రెండు మా ఊరి పొలిమేర 2.

దర్శకుడు తరుణ్ భాస్కర్ బ్రాండ్ ఈసారి బలంగా పని చేస్తోంది. పబ్లిసిటీ మొత్తాన్ని తన భుజాల మీద వేసుకుని ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, మీమ్ వీడియోలు అన్నీ తానే చూసుకుంటున్నాడు. క్యాస్టింగ్ లో కనీస స్టార్లు ఎవరు లేకపోవడంతో భారం మొత్తం తన మీదే పడింది. ట్రైలర్ క్రేజీగా అనిపించడం, యూత్ కి నచ్చే డార్క్ కామెడీ ఎక్కువగా దట్టించడం లాంటి అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. నిన్న వేసిన ప్రీమియర్స్ నుంచి మంచి రిపోర్ట్సే వస్తున్నాయి. ఇక ఓటిటిలో హిట్ అయిన సినిమాకు కొనసాగింపుగా మా ఊరి పొలిమేర 2కి బజ్ తేవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.

సత్యం రాజేష్, బాలాదిత్య లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ ఈ మాత్రం హైప్ రావడం గొప్పే. కంటెంట్ మాట్లాడితే మాత్రం దానికైన బిజినెస్ కి లాభాలు ఖాయం. ఈ రెండు కాకుండా విధి, నరకాసుర, ప్లాట్, మిడ్ నైట్ కిల్లర్స్, ద్రోహి, ఒక్కసారి ప్రేమించాక, అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఒక రోజు గ్యాప్ తో శివరాజ్ కుమార్ ఘోస్ట్ శనివారం వస్తుంది. ఖచ్చితంగా జనం మాట్లాడుకునే రేంజ్ లో టాక్ వస్తేనే ఇవి నిలదొక్కుకుంటాయి. కనీసం మీడియం రేంజ్ హీరో మూవీ ఒక్కటికీ లేకపోవడం బయ్యర్లు కొంత వెలితిగా ఫీలవుతున్నారు. చూడాలి మరి రేపు ఏం జరగబోతోందో.