అడవి జాతిలో రక్తపాతం ‘తంగలాన్’

సినిమా కోసం ఏకంగా ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడే హీరోగా చియాన్ విక్రమ్ మీద అభిమానులకు ప్రత్యేక గౌరవముంది. శంకర్ ఐ టైంలో బక్కపలచగా మారడం కోసం తిండి తిప్పలు మానేసి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి రిస్క్ చేసినట్టు కనిపిస్తోంది. రజనీకాంత్ కాలా, కబాలి తీసిన పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ వచ్చే ఏడాది జనవరి 26 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు టీజర్ మీదే ఉన్నాయి. చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తంగలాన్ గురించి కొంత ఐడియా వచ్చేలా వీడియో కట్ చేశారు.

అది దశాబ్దాల క్రితం వెనుకటి కాలం. ఎక్కడో సుదూర అటవీ ప్రాంతంలో కొండలు కోనల మధ్య నివసించే ఒక జాతిలో ఉంటాడు తంగలాన్ (విక్రమ్). దేనికీ భయపడని నైజం. అక్కడి తెగల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. నిత్యం కొట్టుకునే వీళ్ళ మధ్యలో ఒక తెల్లతోలు బ్రిటిష్ వ్యక్తి వచ్చి చిచ్చు పెడతాడు. బయటి ప్రపంచానికి తెలియని ఒక విలువైన రహస్యాన్ని దాచుకున్న ఆ లోయలో రక్తపాతం మొదలవుతుంది. విషనాగులను సైతం నోటితో కొరికి చంపేసే తంగలాన్ కు సాటి మనుషులనే నరికి పాతరేసే పరిస్థితికి వెళ్తాడు. అసలేం జరిగిందో తెలియాలంటే అతని కథ చూడాలి.

విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. చెబితే కానీ గుర్తుపట్టలేనంతగా విక్రమ్ చాలా వికృతమైన రూపంతో, భయం గొలిపే చూపులతో ఏ అవార్డు అయినా సరే వచ్చి వరించాల్సిందే అనే రేంజ్ లో విశ్వరూపం చూపించాడు. హీరోయిన్ మాళవిక మోహనన్ ని గుర్తుపడితే గొప్పే అనే రేంజ్ లో మేకోవర్ చేశారు. టీజర్ కేవలం నిమిషంన్నర లోపలే ఉన్నా కట్టిపడేసేలా ఎడిట్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ప్రాణం పోయగా, దర్శకుడు పా రంజిత్ మరోసారి తన ఆలోచనలు ఎంత విభిన్నంగా ఉంటాయో చూపించారు. జనవరి 26 తెలుగుతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో తంగలాన్ రిలీజ్ కానుంది.