క్రేజీ సీజన్లలో రిలీజ్ కోసం ఎక్కువ సినిమాలు బరిలో నిలిచినపుడు థియేటర్ల సమస్య తలెత్తడం మామూలే. ఇటీవల దసరా టైంలో కూడా మూడు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడంలో కొంచెం ఇబ్బంది తలెత్తింది. అనువాద చిత్రమైన ‘లియో’కు ఎక్కువ స్క్రీన్లు ఇచ్చి రవితేజ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’కు అన్యాయం చేశారనే చర్చలు ఇండస్ట్రీలో నడిచాయి. ఐతే ఈ గొడవ గురించి బయట అయితే పెద్దగా డిస్కషన్లు లేవు. ఇక డిసెంబరు రెండో వారం కోసం ఎంత పోటీ నెలకొందో తెలిసిందే.
క్రిస్మస్ సినిమాలు హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండు వారాలు ప్రిపోన్ కావడంతో డిసెంబరు సెకండ్ వీకెండ్‌కు షెడ్యూల్ అయిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలకు ఇబ్బంది తప్పలేదు. వేరే మార్గం లేక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని వాయిదా వేయాలని నిర్మాత నాగవంశీ చూస్తుంటే.. హీరో విశ్వక్సేన్ గొడవ మొదలుపెట్టాడు. సినిమాను వాయిదా వేస్తే ఒప్పుకోనని అల్టిమేటం విధిస్తూ అతను ఇటీవల పెట్టిన సోషల్ మీడియా పోస్టు ఎంత వైరల్ అయిందో తెలిసిందే.
ఐతే డిసెంబరు రెండో వారంలో నాలుగు మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేయడానికే ఇంత ఇబ్బంది ఉంది.. థియేటర్ల సమస్య తలెత్తుతోంది అంటే.. సంక్రాంతి సినిమాల సంగతేంటో ఒకసారి ఆలోచించాలి. ఆ పండక్కి మామూలుగానే డిమాండ్ ఎక్కువ. మూణ్నాలుకు తక్కువ కాకుండా సినిమాలు రిలీజవుతుంటాయి. ప్రతి సంవత్సరం థియేటర్ల విషయంలో గొడవ తప్పదు. ఈ ఏడాది సంక్రాంతి టైంలోనూ గొడవ గొడవైంది. రెండు తెలుగు సినిమాలకు తోడుగా రెండు అనువాద చిత్రాలను రిలీజ్ చేస్తుంటేనే థియేటర్ల సమస్య తలెత్తింది.
అలాంటిది అరడజను స్ట్రెయిట్ తెలుగు సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే అసాధ్యం అన్నట్లే. ఐతే షెడ్యూల్ అయిన ఆరు చిత్రాల మేకర్స్ కూడా ఎవరికి వాళ్లు తగ్గేదే లేదంటున్నారు. ఇందులో కనీసం నాలుగు సినిమాలు రిలీజ్ కావడం పక్కా అంటున్నారు. అంతకుమించి సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యం. కానీ తప్పుకునే రెండో చిత్రాలేవనే విషయంలో క్లారిటీ లేదు. నాలుగు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడంలోనూ ఇబ్బందులు తప్పవు. ఐతే ప్రస్తుతం రేసులో ఉన్న ఆరు చిత్రాల నిర్మాతలూ.. ఎవరికి వాళ్లు థియేటర్ల కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు.
థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ ఈ అగ్రిమెంట్లు పక్కాగా అమలు అవుతాయని లేదు. రిలీజ్ టైం దగ్గర పడేసరికి ఎవరి బలం, పలుకుబడిని బట్టి థియేటర్లు దక్కించుకుంటారు. ఆ టైం వచ్చేసరికి వాయిదా వేసుకోక తప్పని చిత్రాల టీమ్స్ అసంతృప్తిని వెళ్లగక్కడం ఖాయం. అలాగే రేసులో ఉన్న సినిమాల నిర్మాతల మధ్య కూడా థియేటర్ల కోసం పెద్ద గొడవే జరిగేలా ఉంది. కాబట్టి సంక్రాంతి ముంగిట టాలీవుడ్లో ఒక రణరంగం చూసే అవకాశం కనిపిస్తోంది.