‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘యానిమల్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇది పక్కా హిందీ సినిమా అయినప్పటికీ.. దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు తెచ్చుకున్న చిత్రంగా ఇది నిలిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు.
‘యానిమల్’ రిలీజ్‌కు సరిగ్గా ఇంకో నెల రోజుల సమయమే ఉండగా.. ఈ లోపు ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సినిమా రన్ టైం మూడున్నర గంటలని.. ఆ నిడివితోనే ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్నారని నిన్నట్నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘దాన వీర శూర కర్ణ’ రోజుల్లో అయితే మూడున్నర నాలుగ్గంటల నిడివి ఉన్నా థియేటర్లలో జనం చూశారు కానీ.. గత రెండు దశాబ్దాల్లో ఇంత రన్‌టైంతో రిలీజైన మెయిన్ స్ట్రీమ్ సినిమాలు దాదాపుగా కనిపించవు.
రన్ టైం ఇంకా ఇంకా తగ్గించేస్తున్న ఈ రోజుల్లో మూడున్నర గంటల నిడివి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఐతే ఈ వార్త వైరల్ అయ్యాక ‘యానిమల్’ టీం నుంచి క్లారిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ రన్ టైం గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదట. ఇంకా ఫైనల్ లెంగ్త్ లాక్ చేయలేదని తెలుస్తోంది. విడుదలకు రెండు వారాల ముందే ఈ విషయం తేలుతుందట.
‘అర్జున్ రెడ్డి’కి కూడా మూడున్నర నాలుగ్గంటల మధ్య రన్ టైం వస్తే.. చివరికి ఎడిట్ చేసి మూడు గంటల నిడివితో రిలీజ్ చేయించాడు సందీప్. ‘యానిమల్’ రన్ టైం కూడా ఎక్కువ ఉంటుందని.. కానీ మూడున్నర గంటల నిడివితో రిలీజ్ చేసే అవకాశాలే లేదని తెలుస్తోంది. థియేటర్ల యాజమాన్యాలే అంత నిడివికి ఒప్పుకోవు. ఆ రన్‌టైంతో రోజుకు నాలుగు షోలు రన్ చేయడం కష్టమవుతుంది. ఇక ప్రేక్షకులు కూడా సినిమా ఎంత బావున్నా కూడా అంత టైం వెచ్చించడం అంటే కష్టమే. కాబట్టి మహా అయితే మూడు గంటల నిడివితో రిలీజ్ చేస్తారే తప్ప మూడున్నర గంటలకు స్కోపే లేదని టీం వర్గాలు అంటున్నాయి.