రవితేజ పేరు ముందు మాస్ రాజా అనే పేరు ఊరికే రాలేదు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో చాలా వరకు మాస్ మసాలా సినిమాలే. రవితేజ పక్కా మాస్ సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుంటుంది. వాటికి మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. అలా అని రవితేజ ఎప్పుడూ రొడ్డకొట్టుడు సినిమాలే చేస్తాడనేమీ లేదు. మధ్య మధ్యలో ప్రయోగాత్మక కథలూ చేస్తున్నాడు. అలాంటి కథలను నమ్మి చాలా సిన్సియర్‌గా నటించాడు కూడా.
కానీ అతనెంత బాగా చేసినా కూడా తన శైలికి భిన్నమైన సినిమాలు చేసిన ప్రతిసారీ నిరాశే ఎదురైంది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, సారొచ్చారు, డిస్కో రాజా.. ఇలా ఈ వరుసలో చెప్పుకోవడానికి చాలా సినిమాలే ఉన్నాయి. ఇవేవీ కూడా తీసి పడేయదగ్గ సినిమాలు కాదు. వాటిలో విషయం ఉంది. రవితేజ కూడా చాలా బాగా నటించాడు ఆయా చిత్రాల్లో. కానీ వాటిలో వేరే లోపాల వల్ల అవి వర్కవుట్ కాలేదు.
ఇలా డిఫరెంట్ సినిమాలతో డిజాస్టర్లు తిన్నాక రవితేజ తన మార్కు మాస్ సినిమా చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. ‘డిస్కో రాజా’ తర్వాత ‘క్రాక్’.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తర్వాత ‘ధమాకా’ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. తనకు మాస్ సినిమాలే మంచి ఫలితాలిస్తున్నప్పటికీ రవితేజ ఒక మూసలో ఉండిపోవడానికి ఎప్పుడూ ఇష్టపడట్లేదు.
తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో మాస్ అంశాలు ఉన్నా సరే.. ఒక మూసలో సాగిపోయే సినిమా మాత్రం కాదు. రవితేజకు ఈ పాత్ర చాలా కొత్తగా అనిపించేదే. కథ పరంగా కూడా వైవిధ్యం ఉంది. కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రాబట్టుకోలేకపోయింది. సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉన్నా కూడా.. అవి సరిపోలేదు. దసరా సీజన్లో రిలీజ్ కావడం వల్ల ప్రేక్షకాదరణ పర్వాలేదు కానీ.. ఓవరాల్‌గా రవితేజకు మరోసారి డిఫరెంట్ అటెంప్ట్ డిజప్పాయింట్మెంటే మిగిల్చేలా ఉంది.