చైతు సామ్ వెబ్ సిరీస్ ఏమయ్యాయి

అదేంటో నాగ చైతన్య సమంతలు విడాకులు తీసుకుని చాలా కాలమైనా కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళిద్దరికీ కాకతాళీయంగా సారూప్యతలు ఎదురవుతున్నాయి. చైతు మొదటి డిజిటల్ డెబ్యూ దూత వెబ్ సిరీస్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత సంవత్సరం దసరా నుంచి అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో చెప్పడం లేదు. ఈ ఏడాది విజయదశమి కూడా అయిపోయింది. దీపావళికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆ మధ్య అక్టోబర్ లో రావొచ్చని ఊరించారు కానీ అసలా ఊసే లేదు. కట్ చేస్తే అభిమానులు సైతం దీని గురించి మర్చిపోయారు.

ఇక సమంతా విషయానికి సిటాడెల్ ఇండియన్ రీమేక్ ఎప్పుడో ఫినిష్ చేసింది. ఒరిజినల్ హిందీతో పాటు భారతీయ భాషల్లో విడుదలకు రెడీగా ఉంది. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేసిన ఇంగ్లీష్ వెర్షన్ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. చిత్రంగా దీన్ని తెలుగుతో సహా అమెజాన్ ప్రైమ్ అసలు రిలీజ్ టైంలోనే అనువాదాలు అందుబాటులో ఉంచింది. ఇక్కడ రాజ్ అండ్ డికె లాంటి స్టార్ డైరెక్టర్లు టేకప్ చేసిన సిరీస్ ఇది. దీనికీ మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ఈ రెండు వెబ్ సిరీస్ లు నిర్మించింది అమెజాన్ ప్రైమ్. దీనికన్నా ఆలస్యంగా మొదలైనవి ఎప్పుడో వచ్చేసి పాతబడి పోయాయి కూడా.

సినిమా అయితే ఆలస్యానికి గల కారణాలు ఏదో రూపంలో తెలిసేవి. ఓటిటి ప్రొడక్షన్ కావడంతో లీకులు ఎక్కువగా బయటికి రావడం లేదు. దూతకి విక్రమ్ కుమార్ లాంటి పేరున్న దర్శకుడు తీసినా దాన్ని ఎందుకు దాచి పెడుతున్నారో అంతు చిక్కడం లేదు. ఇక సిటాడెల్ అసలు గుట్టు ప్రైమ్ పెద్దలకే తెలియాలి. నిజానికి ఇండియాలో ఓటిటి బూమ్ గత ఏడాదిగా బాగా తగ్గింది. గంటల తరబడి వీటిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. రివ్యూల చదివి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవుట్ ఫుట్ ని వడబోసి పనిలో ప్రైమ్ లేట్ చేస్తోందో ఏంటో మరి.